తాలిబన్లు కూడా మామూలు పౌరులే.. వారిని ఎందుకు చంపాలి?

తాలిబన్లు కూడా మామూలు పౌరులే.. వారిని ఎందుకు చంపాలి?

ఇస్లామాబాద్: పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ వివాదాస్పద కామెంట్లు చేస్తూ నిత్యం వార్తల్లో ఉంటున్నారు. తమ దేశంలో అత్యాచార ఘటనలు పెరిగిపోవడానికి మహిళల డ్రెస్సింగ్ కారణమంటూ ఇటీవల ఇమ్రాన్ చేసిన వ్యాఖ్యలపై దుమారం రేగుతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఆయన తాలిబన్ల గురించి చేసిన కామెంట్లు కూడా కాంట్రవర్షియల్‌గా ఉన్నాయి. తాలిబన్లకు పాక్ ఆర్థిక సాయం చేస్తోందా అని ఓ అమెరికన్ న్యూస్ చానల్‌ రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు ఇమ్రాన్ ఇచ్చిన సమాధానం చర్చనీయాంశంగా మారింది. ఇందులో ఎలాంటి నిజం లేదని, ఒకవేళ ఈ వాదన  సత్యమని భావిస్తే ఆధారాలు చూపించాలని ఇమ్రాన్ చెప్పారు. 

‘మేం తాలిబన్లకు సాయం చేస్తున్నామని నిరూపించాలి. మమ్మల్ని నిందించేవారు దీన్ని నిరూపిస్తూ ఆధారాలు చూపించాలి. తాలిబన్లు తలదాచుకోవడానికి, పట్టుబడకుండా ఉండటానికి మేం సేఫ్ హౌజ్‌లు ,సేఫ్ హెవెన్స్, అభయారణ్యాలను కేటాయించామని అంటున్నారు. అలాంటి సేఫ్ హెవెన్స్ ఎక్కడున్నాయో చూపించాలి. పాక్‌లో 30 లక్షల మంది అఫ్గాన్ శరణార్థులు ఉన్నారు. తాలిబన్లను మిలిటెంట్లుగా చూడొద్దు. వాళ్లు కూడా సాధారణ పౌరులే. ఒకవేళ శరణార్థుల క్యాంపుల్లో తాలిబన్లు ఉన్నా వారిని పాకిస్థాన్ ఎలా వేటాడుతుంది? ఎందుకు చంపుతుంది?’ అని ఇమ్రాన్ ఖాన్ ప్రశ్నించారు.