కో-ఎడ్యుకేషన్​పై  తాలిబాన్​ బ్యాన్​

కో-ఎడ్యుకేషన్​పై  తాలిబాన్​ బ్యాన్​

కాబూల్​: చదువుకు వ్యతిరేకం కాదంటూనే అఫ్గానిస్తాన్​లో తాలిబాన్లు తమ అసలు రంగు బయటపెట్టేస్తున్నారు. అమ్మాయిలూ చదువుకోవచ్చంటూనే ఆంక్షలు పెడుతున్నారు. సమాజంలో కో–ఎడ్యుకేషన్​ అతిపెద్ద భూతమంటున్నారు. అబ్బాయిలు, అమ్మాయిలు కలిసి చదువుకోవద్దంటున్నారు. కో–ఎడ్యుకేషన్​పై నిషేధం విధించారు. హెరాత్​ ప్రావిన్స్​లోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు స్కూళ్లు, కాలేజీలు, యూనివర్సిటీల్లో కో–ఎడ్యుకేషన్​ను ఎత్తేయాల్సిందిగా ఈమధ్య వర్సిటీల యజమానులు, ప్రొఫెసర్లతో జరిగిన సమావేశంలో తేల్చి చెప్పారు. మూడు గంటల పాటు జరిగిన సమావేశంలో తాలిబాన్​ ప్రతినిధి, హయ్యర్​ ఎడ్యుకేషన్​ అధిపతి ముల్లా ఫరీద్​ ఈ విషయాన్ని స్పష్టం చేశారు. వేరే మార్గమేదీ లేదని, అన్ని యూనివర్సిటీల్లో కచ్చితంగా వేర్వేరు క్లాసులు నిర్వహించాల్సిందేనని ఆదేశాలిచ్చారు. ఆడ పిల్లలకు ఆడ లెక్చరర్లే క్లాసులు చెప్పాలని, మగపిల్లలకు చెప్పకూడదని వారికి తేల్చి చెప్పారు. అధికారిక లెక్కల ప్రకారం హెరాత్​ ప్రావిన్స్​లోని ప్రభుత్వ, ప్రైవేట్​ విద్యాసంస్థల్లో 40 వేల మంది విద్యార్థులు, 2 వేల మంది లెక్చరర్లున్నారు. 

తాలిబాన్​ అంటే ‘విద్యార్థి’

తాలిబాన్​.. పష్తూన్​​భాషలో విద్యార్థి అని అర్థం. కానీ, పేరులో ఉన్న ఆ భావం వారి మనసుల్లో మాత్రం లేదు. తాలిబాన్లకు మొదటి నుంచి చదువంటే విషం. అది ఎవరికీ ఎక్కొద్దన్నది వారి లక్ష్యం. అందుకే వాళ్ల రాజ్యంలో స్కూళ్లు, కాలేజీలు ధ్వంసమయ్యాయి. ఎవరైనా చదువుకుంటున్నారని తెలిస్తే.. వాళ్లతో పాటు వాళ్ల తల్లిదండ్రులను నడిబజార్లో నిలబెట్టి తలలో బుల్లెట్లు దింపేటోళ్లు. అంత కిరాతకంగా ఉండేవి తాలిబాన్ల దిక్తత్​లు. చదువుల పట్ల తాలిబాన్ల వైఖరి, విధానాలపై ఈ ఏడాది ఫిబ్రవరిలో సెంటర్​ ఫర్​ స్టడీ ఆఫ్​ ఆర్మ్​డ్​ గ్రూప్స్​ అనే స్వచ్ఛంద సంస్థ ఓ నివేదికను విడుదల చేసింది. 2009 నుంచి ఇప్పటిదాకా వారి వైఖరిలో మార్పులను వివరించింది. పూర్తిగా కాకపోయినా కొంతైనా వాళ్లు మారారని ఆ నివేదిక చెప్తోంది. 

విద్యా సంస్థలంటే శత్రు స్థావరాలట

ఒకప్పుడు విద్యాసంస్థలంటేనే తాలిబాన్లు శత్రు స్థావరాల్లా చూసేటోళ్లు. ఎవరైనా అందులోకి వెళ్లారంటే.. అది ఒక మిలటరీ వస్తువైపోతుందని, తమ రాజ్యం నశిస్తుందని అనుకునేటోళ్లు. అంతేకాదు.. కరోనా సమయంలో స్కూళ్లను శత్రు సైనికులు ఆక్రమించేశారని తాలిబాన్లు అనుకుంటున్నారు. ఇటు స్కూళ్లంటే పోలింగ్​ కేంద్రాలు అనే ఫీలింగ్​ తాలిబాన్లలో ఎక్కువగా ఉంది. దీంతో ఎన్నికలు జరిగిన ప్రతిసారీ అవే టార్గెట్​గా తాలిబాన్లు దాడులు చేస్తుంటారు. ఐక్యరాజ్యసమితి ఇచ్చిన యునామా హ్యూమన్​ రైట్స్​ 2019 నివేదిక ప్రకారం 2018 పార్లమెంట్​ ఎన్నికల్లో పిల్లల చదువులు పాడయ్యేలా స్కూళ్లపై తాలిబాన్లు 92 దాడులు చేశారు. యునామా హ్యూమన్​ రైట్స్​ 2020 నివేదిక ప్రకారం 2019 అధ్యక్ష ఎన్నికలప్పుడు స్కూళ్లు టార్గెట్​గా 21 దాడులు జరిగాయి. అయితే, అవి ఎవరు చేశారన్నది మాత్రం సంస్థ వెల్లడించలేదు. అంతేకాదు.. చాలా చోట్ల తాలిబాన్లు దాడులు చేసి స్కూళ్లను బంద్​ పెట్టించారు. అడ్డుకున్నోళ్లను చంపేశారు.