అఫ్గాన్‌లో అంతర్జాతీయ మీడియాపై బ్యాన్

అఫ్గాన్‌లో అంతర్జాతీయ మీడియాపై బ్యాన్
  • అఫ్గాన్ లో బీబీసీ, ఇతర ఇంటర్నేషనల్ చానెళ్లపై నిషేధం 
  • ప్రభుత్వ ఉద్యోగులకు గడ్డం, డ్రెస్‌‌ కోడ్‌‌ మస్ట్‌‌
  • అవి పాటించకుంటే ఉద్యోగం నుంచి ఊస్టింగే

కాబూల్: అఫ్గానిస్తాన్ లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పటి నుంచి ఒక్కో అంశంపై ఆంక్షలు పెడుతూ వస్తున్న తాలిబాన్ సర్కార్ ఈ సారి అంతర్జాతీయ మీడియాను బ్యాన్‌‌ చేస్తున్నట్టు ప్రకటించింది. ఈ లిస్టులో ముందుగా బీబీసీపైనే తాలిబాన్లు వేటు వేశారు. ఆదివారం సాయంత్రం నుంచే దాని ప్రసారాలను నిలిపేశారు. బీబీసీతోపాటుగా వాయిస్ ఆఫ్ అమెరికా, జర్మన్‌‌ డాయ్‌‌చు వెల్లె, చైనా గ్లోబల్‌‌ టెలివిజన్ నెట్‌‌వర్క్‌‌ ప్రసారాలనూ బ్యాన్ చేశారు. అయితే తాలిబాన్లు బ్యాన్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని బీబీసీ కోరింది. ఈ నిర్ణయంతో పర్షియన్, పాష్తో, ఉజ్బెక్‌‌ భాషల్లో కార్యక్రమాలు చూసే 60 లక్షల మందిపై ప్రభావం పడుతుందని చెప్పింది. శాటిలైట్‌‌ టీవీ ప్రసారాలు చూసే సుమారు 20% మంది అఫ్గాన్లు మాత్రమే బీబీసీ పర్షియన్ టీవీ చానెల్ ప్రసారాలను చూడగలుగుతున్నారు. పోయినేడాది ఆగస్టులో తాలిబాన్ సర్కారు ఏర్పడినప్పటి నుంచి 40 శాతం మీడియా సంస్థలు మూతపడ్డాయి. దాదాపు 6,400 మంది జర్నలిస్టులు నిరుద్యోగులయ్యారు. 

గడ్డం పెంచకుంటే నో జాబ్

మహిళలు, వాళ్ల చదువులు, ఉద్యోగాలు, మీడియాపైనే కాకుండా ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగులు వేసుకునే బట్టలపై కూడా తాలిబాన్లు ఆంక్షలు పెడుతున్నారు. ఇందులో భాగంగా ప్రభుత్వ ఉద్యోగులు గడ్డాలు పెంచుకున్నారా, డ్రెస్ కోడ్‌‌ పాటిస్తున్నారా లేదా అనే విషయాల పరిశీలనకు అన్ని ప్రభుత్వ ఆఫీసుల ఎంట్రన్స్‌‌ల వద్ద తనిఖీలు నిర్వహిస్తున్నారు. గడ్డం తప్పకుండా పెంచుకోవాలని, పొడవుగా, లూజుగా ఉండే టాప్, ప్యాంట్ వేసుకోవాలని, టోపీ లేదా తలపాగా పెట్టుకోవాలని ప్రాపగేషన్‌‌ ఆఫ్‌‌ వర్చ్యూ అండ్ ప్రివెన్షన్ ఆఫ్ వైస్‌‌ మినిస్ట్రీ అధికారులు ఆదేశిస్తున్నారు. డ్రెస్‌‌ కోడ్‌‌ పాటించకపోయినా, గడ్డం పెంచకున్నా ఆఫీసుల్లోకి రానివ్వబోమని ఆదేశాలిచ్చినట్టు చెప్తున్నారు.

అమ్మాయిలను చదువుకోనివ్వాలె: యూఎన్

అఫ్గాన్ అమ్మాయిలను హైస్కూల్‌‌ చదువులకు దూరం చేస్తూ తాలిబాన్లు తీసుకున్న నిర్ణయంపై ఐక్యరాజ్యసమితి ఆందోళన వ్యక్తం చేసింది. వారు చదువుకోవడానికి అవకాశం ఇవ్వాలని సూచించింది. అఫ్గాన్ లో బాలికలు ఆరో తరగతికి మించి చదవొద్దంటూ తాలిబాన్ లు ఇచ్చిన ఆదేశాలను వెనక్కి తీసుకోవాలని కోరింది. అందరికీ విద్యా హక్కును బాలికలతో సహా అఫ్గాన్‌‌లోని ప్రజలందరికీ అందేలా చూడాలని యూఎన్ సెక్యూరిటీ కౌన్సిల్‌‌ మెంబర్లు కోరారు. బాలికలు హైస్కూల్స్‌‌కు వచ్చేలా వెంటనే ఆదేశాలివ్వాలని యూఎన్‌‌ సెక్యూరిటీ కౌన్సిల్‌‌ ఆదివారం ఒక స్టేట్‌‌మెంట్‌‌ విడుదల చేసింది.