అన్నదాతల ఆందోళనతో వెనక్కి తగ్గిన ఆఫీసర్లు

అన్నదాతల ఆందోళనతో వెనక్కి తగ్గిన ఆఫీసర్లు
  • పూడిక తీస్తే ప్రమాదమంటున్న రైతులు
  • అన్నదాతల ఆందోళనతో వెనక్కి తగ్గిన ఆఫీసర్లు

భద్రాచలం, వెలుగు: చర్ల మండలంలోని తాలిపేరు ప్రాజెక్టులో సిల్ట్ తీసేందుకు ఇరిగేషన్ ఇంజినీర్లు ప్రపోజల్స్ రూపొందించారు. అశ్వాపురం–దుమ్ముగూడెం మండలాల మధ్య గోదావరిపై నిర్మిస్తున్న సీతమ్మసాగర్ బ్యారేజీ​బ్యాక్ వాటర్ నుంచి దుమ్ముగూడెం, చర్ల మండలాలతోపాటు మణుగూరు, అశ్వాపురం, పినపాక మండలాలను రక్షించేందుకు నిర్మిస్తున్న కరకట్టలకు ఈ పూడిక తీసిన మట్టిని వినియోగించేలా ప్రపోజల్స్ సిద్ధం చేశారు. ఈ క్రమంలో రైతుల అభిప్రాయాల కోసం సిద్ధమయ్యారు. అయితే తాలిపేరు ఇరిగేషన్ ​ఇంజినీర్లు ఈ ప్రపోజల్స్ ను రైతుల ముందుంచగా చాలా మంది వ్యతిరేకించారు. అసలే గోదావరి వరదలతో పంటలు ఆలస్యంగా సాగుచేశామని, యాసంగిలోనూ సాగునీరు కావాలని, ఈ సమయంలో సిల్ట్ తీసి నీటి విడుదల ఆపితే ఎలా? అని వారు వాదించారు. దీంతో వివాదం రేగి ఇంజినీర్లు మీమాంసలో పడ్డారు.

కరువులోనూ సాగునీరు..

1978లో నిర్మించిన తాలిపేరు ప్రాజెక్టు తెలుగు రాష్ట్రాల్లో కరవు కాటకాలు వచ్చిన కాలంలోనూ సాగునీరు అందించి భద్రాచలం–మన్యం ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసింది. 24,700 ఎకరాల ఆయకట్టు ఈ ప్రాజెక్టు కింద ఉంది. జలాశయం నీటిమట్టం74 మీటర్లు ఉంటుంది. ఛత్తీస్​గఢ్, ఒడిశా రాష్ట్రాల అడవుల్లోని వాగులు, వంకల ద్వారా తాలిపేరు ఉపనదికి నీరు వస్తుంటుంది. యాసంగిలోనూ దాదాపు 8వేల ఎకరాలకు సాగునీటిని అందిస్తోంది. ప్రాజెక్టు నిర్మించిన నాటి నుంచి రిజర్వాయర్​లో పూడిక తీయలేదు. పూడిక తీస్తే నీటి నిల్వ సామర్థ్యం పెరుగుతుందని ఇంజినీర్ల అభిప్రాయం. సీతమ్మసాగర్​బ్యారేజీ నిర్మాణంలో కరకట్టలను కడుతున్నారు. వీటికి అవసరమైన మట్టిని తాలిపేరు రిజర్వాయర్ సిల్ట్ తీయడం ద్వారా తరలించాలని ఇరిగేషన్ ఇంజినీర్లు భావిస్తున్నారు. సుమారు రూ.10కోట్ల విలువ చేసే పూడిక తీత పనులు ఉచితంగా చేయడం ద్వారా రైతులకు మేలు చేకూరుతుందని వారి వాదన. సుమారు 50 వేల క్యూబిక్​మీటర్ల మట్టిని తీసేందుకు నిర్ణయించారు. 

అధ్యయనం చేయకుండా ఎలా...?!

అయితే పూడికతీతకు సంబంధించి తాలిపేరు ఇరిగేషన్ ఇంజినీర్ల ప్రపోజల్స్ పై రైతుల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తాలిపేరు పరివాహక ప్రాంతంలో వాగులు, వంకలు విపరీతమైన వేగంతో ప్రవహిస్తాయని, సిల్ట్​తీయడం ద్వారా ప్రాజెక్టు గేట్లకు ప్రమాదం ఉంటుందని వారు అంటున్నారు. సాధారణంగా ప్రాజెక్టుల్లో పూడికతీతపై సైంటిఫిక్​అధ్యయనం చేయాలి. ఇప్పటి వరకు దేశంలో కేరళలోని ముళ్లపెరియార్​అనే ప్రాజెక్టు నుంచి మాత్రమే సిల్ట్ తీశారు. రాష్ట్రంలో శ్రీరాంసాగర్, నాగార్జునసాగర్, శ్రీశైలం ప్రాజెక్టుల్లో భారీగా పూడిక ఉంది. కానీ వీటి జోలికి పోని ఇరిగేషన్​శాఖ ఇప్పుడు కరకట్టలకు వారికి అవసరమైన నల్లమట్టి కోసమే తాలిపేరులో పూడికతీతకు పూనుకున్నారు. 50 వేల క్యూబిక్​మీటర్ల సిల్ట్​తీసేందుకు ముందుకొచ్చారు. దీనిపై అధ్యయనం చేశాకే సిల్ట్ తీస్తే బాగుంటుందని రైతులు అంటున్నారు. 

ప్రాజెక్టుకు ప్రమాదం..

ప్రాజెక్టులో పూడికతీస్తే నష్టం జరుగుతుంది. ఇప్పటికైతే ఏ రిజర్వాయర్​లో పూడిక తీయలె. మాకు యాసంగికి నీరియ్యకుండా అడ్డగోలుగా నిర్ణయించిండ్రు. కనీసం దీనిపై రైతులకు తెలపాలె కదా. ప్రాజెక్టుకు ప్రమాదం జరిగితే రైతులకు కష్టం వస్తుంది. 
–ఇందల బుచ్చిబాబు, రైతు,కొత్తగూడెం.

ఇప్పటికైతే వెనక్కి తీసుకున్నం..

ప్రస్తుతం తాలిపేరు ప్రాజెక్టులో సిల్ట్​తీయాలనే ప్రపోజల్స్ చేశాం. రైతులు వ్యతిరేకించారు. పూడికతీతతో ప్రాజెక్టుకు ఇబ్బంది, ప్రమాదం ఉండదు. అపోహలు వద్దు. నీటి నిల్వ సామర్థ్యం పెరుగుతుంది. ఖర్చు లేకుండా పూడికతీసే అవకాశం దొరికినందునే కరకట్టల నిర్మాణానికి ఈ మట్టిని వాడేలా ప్రపోజల్స్ చేసినం. మిషన్​కాకతీయ ద్వారా చెరువుల్లో పూడికలు తీసినం. ఎక్కడైనా చెరువులు తెగినయా.?
–తిరుపతి, డీఈ, తాలిపేరు ప్రాజెక్టు, చర్ల