ఆదిలాబాద్, వెలుగు: అమ్మాయిలా గొంతు మార్చి ఓ యువకుడిని ట్రాప్ చేసి రూ. 8 లక్షలు కొట్టేసిన ఘటన ఆదిలాబాద్ జిల్లాలో జరిగింది. సోమవారం ఆదిలాబాద్ డీఎస్పీ జీవన్ రెడ్డి మీడియాకు వివరాలు వెల్లడించారు. సూర్యాపేట జిల్లాకు చెందిన మాలోత్ మంజి( కృష్ణవేణిగా గొంతు మార్చిన వ్యక్తి), భూక్యా గణేశ్, రూపవత్ శ్రావణ్ కుమార్ ను అరెస్ట్ చేసినట్లు తెలిపారు.
ఆదిలాబాద్ పట్టణానికి చెందిన లక్ష్మీకాంత్ తన పెండ్లి కోసం ఆన్లైన్, యూట్యూబ్ లో వెతుకుతున్న క్రమంలో కృష్ణవేణి అనే అమ్మాయి ఫొటోతో యూట్యూబ్ లో శ్రావణ్ కుమార్ పరిచయమయ్యాడు. కృష్ణవేణి అనే అమ్మాయి ఉందని నమ్మబలికి మంజిని కృష్ణవేణిగా పరిచయం చేశాడు. తాను ఒక ధనవంతురాలినని, తన ఆస్తులు కోర్టులో చిక్కుకున్నాయని నమ్మించాడు.
పెండ్లి తరువాత ఆస్తులన్నీ చూసుకోవాలని, లాయర్ కు డబ్బులు ఇవ్వాల్సి వస్తుందని చెప్పి విడతల వారీగా రూ. 8 లక్షలు కాజేశారు. ఆ తరువాత తాను మోసపోయినట్లు గుర్తించిన బాధితుడు1930 ద్వారా సైబర్ క్రైమ్‌కు ఫిర్యాదు చేశాడు. ఈ నెల 25న వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేసిన పోలీసులు నిందితులను గుర్తించి సోమవారం సూర్యాపేటలో అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ.1.50 లక్షల నగదు, మూడు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఉమెన్ పీఎస్ సీఐ ప్రేమ్ కుమార్, సైబర్ సెల్ ఎస్సై గోపీకృష్ణ పాల్గొన్నారు.
