మాతృభాషలో మాట్లాడితే భాషను రక్షించుకున్నట్లే : వెంకయ్య నాయుడు

మాతృభాషలో మాట్లాడితే భాషను రక్షించుకున్నట్లే :  వెంకయ్య నాయుడు

హైదరాబాద్, వెలుగు: మాతృభాషలో మాట్లాడితే.. భాషను రక్షించుకున్నవారమవుతామని, పరాయి భాషపై వ్యామోహం పెంచుకోవడంతో మాతృభాష ఉనికి కోల్పోతోందని మాజీ ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్య నాయుడు చెప్పారు. తల్లిదండ్రులు పిల్లలకు మాతృభాషపై ప్రేమను కలిగించాలని సూచించారు. సోమవారం పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీలో జస్టిస్ ఆవుల సాంబశివరావు పురస్కారాల ప్రదానోత్సవం జరిగింది. 

వెంకయ్యనాయుడు పాల్గొని మాట్లాడుతూ.. ఆంధ్రుల చరిత్రను సమగ్రంగా, సవివరంగా నేటి సమాజానికి అందించాలన్నారు. భాష,  సంస్కృతులను వ్యవస్థలు పూర్తి స్థాయిలో పరిరక్షించలేవని, అందరి భాగస్వామ్యంతో సాధ్యమవుతుందని చెప్పారు. భాష ఒంటరిది కాదని, లలిత కళలు ఇమిడిన సంస్కృతి దానికి తోడుగా ఉంటుందని, భాష దూరమైతే శ్వాస లేనట్లేనన్నారు. జస్టిస్ ఆవుల సాంబశివరావు విలువలను పాటించి వృత్తికే కాకుండా తెలుగు వారందరికీ గుర్తింపు తెచ్చిన గొప్ప మానవతావాదని గుర్తుచేశారు. 

అనంతరం 2023 సంవత్సరానికి గాను చరిత్ర పరిశోధకులు హైదరాబాద్ విశ్వవిద్యాలయం రిటైర్ట్​ప్రొఫెసర్ వకుళాభరణం రామకృష్ణను, 2024 సంవత్సరానికి గాను మనసు ఫౌండేషన్ వ్యవస్థాపకులు మన్నం వెంకటరాయుడుకు పురస్కారంతోపాటు రూ. 25,000 నగదు అందజేశారు. యూనివర్సిటీ ఉపాధ్యక్షుడు తంగెడ కిషన్ రావు, ఆవుల మంజులత, వకుళాభరణం రామకృష్ణ, మన్నం వెంకటరాయుడు, వర్సిటీ రిజిస్ట్రార్ భట్టు రమేశ్, బి.లక్ష్మి, మండలి వెంకటకృష్ణారావు, విజయ్ పాత్లోత్ తదితరులు  పాల్గొన్నారు.