
న్యూఢిల్లీ: భారత్, పాక్ మధ్య సమస్యల పరిష్కారం కోసం థర్డ్ పార్టీ జోక్యం అవసరం లేదని కేంద్ర విదేశాంగ మంత్రి జైశంకర్ తేల్చి చెప్పారు. గురువారం (మే 15) ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఇకపై పాకిస్థాన్‌తో జరిగే ద్వైపాక్షిక చర్చలు కేవలం పీవోకే, టెర్రరిజంపై మాత్రామేనని స్పష్టం చేశారు. ఇస్లామాబాద్‌తో ఢిల్లీ సంబంధాలు, వ్యవహారాలు పూర్తిగా ద్వైపాక్షికంగా ఉంటాయన్నారు. అంతకుమించి పాకిస్థాన్‌తో మాట్లాడేదేమి లేదన్నారు. పాకిస్థాన్, పీవోకే, టెర్రరిజం విషయంలో భారత వైఖరిలో ఎలాంటి మార్పు లేదని నొక్కి చెప్పారు.
పాకిస్తాన్‌తో చర్చలు ఉగ్రవాదంపై మాత్రమే ఉంటాయని ప్రధాని మోడీ స్పష్టం చెప్పారని గుర్తు చేశారు. పాకిస్థాన్ భారత్‌కు కొందరు ఉగ్రవాదులను అప్పగించాల్సి ఉందని.. ఇక నుంచి ఉగ్రవాదుల మౌలిక సదుపాయాలను పాక్ మూసివేయాల్సిందేనని సూటిగా చెప్పారు. పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకార చర్యగా భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్‌తో పాక్ తీవ్రంగా దెబ్బతిన్నదని.. ఆపరేషన్‌లో భారత సైనిక లక్ష్యాలు సమర్థవంతంగా నెరవేరాయన్నారు. పాక్‌కు ఎంత నష్టం జరిగిందో శాటిలైట్ చిత్రాలు చాలా స్పష్టంగా చూపిస్తున్నాయని తెలిపారు.
Also Read : సున్నా సుంకాలపై రగడ
ఇక, కాల్పుల విరమణ ముందుగా ఎవరూ కోరుకున్నారో అందరికి తెలుసన్నారు. పాకిస్తాన్ సీమాంతర ఉగ్రవాదానికి మద్దతు ఇస్తూనే ఉండటంతో సింధు నది జలాల ఒప్పందం తాత్కాలికంగా నిలిపివేయబడిందని తెలిపారు. పాక్ ఉగ్రవాదాన్ని పూర్తిగా ఆపే వరకు సింధూ నది జలాల ఒప్పందం నిలిపివేస్తామని తేల్చి చెప్పారు. ఇక.. కాశ్మీర్లో చట్టవిరుద్ధంగా ఆక్రమించబడిన భారత భూభాగాన్ని పాక్ ఖాళీ చేయాల్సిందేనని.. దీనిపై మేం చర్చలకు సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు.