
ఎనిమిది నెలల పసిపాప.. ఐదంతస్థుల బిల్డింగ్ నుంచి పడి, స్వల్ప గాయాలతో బయటపడిన ఘటన తమిళనాడులోని చెన్నై లో జరిగింది. నగరంలోని సోకార్ పేటలోని తన అమ్మమ్మ ఇంట్లో ఆడుకుంటున్న సమయంలో ఆ పాప బాల్కనీ నుంచి జారి కింద పార్క్ చేసి ఉన్న స్కూటీపై పడింది. ఈ నెల 9 న (సోమవారం ఉదయం) ఈ ఘటన జరిగింది.
అపార్ట్ మెంట్ లోని ఐదవ ఫ్లోర్ లో ఉంటున్న ఆ పాప కుటుంబానికి.. బయటి వారు వచ్చి చెప్పేంతవరకూ పాప కింద పడిన సంగతి తెలియదు. ఆ సమయంలో తాము వంట చేస్తున్నామని, పాప బెడ్ రూమ్ లో ఆడుకుంటుందనుకున్నామని వారు చెప్పారు. ఉదయం 10.30 గంటల సమయంలో దాదాపు 50 అడుగుల ఎత్తులో ఉన్న ఆ ఫ్లోర్ నుంచి.. పార్క్ చేసి ఉన్న స్కూటీ సీటు మీద ఆ పాప పడింది.
అక్కడే పేపర్ చదువుకుంటున్న ఓ వ్యక్తి ఏదో వస్తువు పడిందనుకొని.. దగ్గరికెళ్లి చూడగా ఓ పసిపాప స్పృహా కోల్పోయి ఉండడం గమనించాడు. అదే సమయంలో అటుగా వచ్చిన ఓ ఆటో డ్రైవర్ పాప పరిస్థితి గమనించాడు. వెంటనే ఆటోలో ఉన్న తన ప్యాసింజెర్స్ ని దింపేసి అక్కడున్న కొంతమంది వ్యక్తుల సాయంతో పాపను అపోలో చిల్డ్రన్స్ ఆసుపత్రికి తరలించారు. ప్రాథమిక చికిత్స అనంతరం.. ఆ పాప మెదడు, వెన్నుముక పనితీరు అంతా బాగానే ఉందని, తొడ ఎముక కు మైనర్ ఫ్యాక్చర్ జరిగిందని డాక్టర్ రాజేశ్వరి నటరాజ్ అన్నారు.
ప్రమాదం జరిగిన 20 నిమిషాల తర్వాత కిందనే ఉన్న కొంతమంది వ్యక్తులు.. ఐదవ ఫ్లోర్ లో ఉన్న ఇంటింటికి తిరిగి వెళ్లి అడగ్గా.. ఓ కుటుంబం ఆ పాప తమ పాపే అని, పేరు జినిషా అని చెప్పారు. జరిగిన సంగతి తెలుసుకొని.. దేవుడి దయ వల్లె తమ పాప ప్రమాదం నుంచి బయటిపడిందని చెప్పి, ఆసుపత్రికి బయల్దేరారు.