పదవిలో ఉండగానే ఓడిపోయిన.. నాలుగో సీఎంగా స్టాలిన్ రికార్డు

పదవిలో ఉండగానే ఓడిపోయిన.. నాలుగో సీఎంగా  స్టాలిన్ రికార్డు
  • కొళత్తూర్‌‌‌‌‌‌‌‌లో స్టాలిన్ ఓటమి
  • పదవిలో ఉండగానే ఓడిపోయిన నాలుగో సీఎంగా రికార్డు
  • 9వేల ఓట్ల మెజార్టీతో గెలుపొందిన టీవీకే అభ్యర్థి వీఎస్ బాబు
  • సీఎం పదవికి రాజీనామా

చెన్నై: తమిళనాడు రాజకీయాల్లో పెను సంచలనం నమోదైంది. డీఎంకే కంచుకోటగా భావించే కొళత్తూర్ నియోజకవర్గంలో ఆ పార్టీ చీఫ్​, సీఎం ఎంకే స్టాలిన్‌‌‌‌ ఓటమిని చవిచూశారు. ఈ స్థానంలో టీవీకే పార్టీ అభ్యర్థి వీఎస్ బాబు ఘన విజయం సాధించారు. ఈసీ వెల్లడించిన గణాంకాల ప్రకారం.. 22 రౌండ్ల ఓట్ల లెక్కింపు పూర్తయ్యేసరికి టీవీకే అభ్యర్థి వీఎస్. బాబుకు 82,997 ఓట్లు రాగా, స్టాలిన్‌‌‌‌కు 74,202 ఓట్లు మాత్రమే వచ్చాయి. దీంతో బాబు 8,795 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. తమిళనాడు రాజకీయ చరిత్రలో పదవిలో ఉండగానే అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన నాల్గో సీఎంగా స్టాలిన్ నిలిచారు.1996 తర్వాత స్టాలిన్ ఓడిపోవడం ఇదే తొలిసారి. గత 15 ఏండ్లుగా ఒకే నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నప్పటికీ, ఈసారి యువత, కొత్త ఓటర్లు విజయ్ నేతృత్వంలోని టీవీకే వైపు మొగ్గు చూపడం స్టాలిన్ ఓటమికి ప్రధాన కారణంగా విశ్లేషకులు భావిస్తున్నారు. ఇక ఏఐఏడీఎంకే అభ్యర్థి  ఆర్. సంతానకృష్ణన్ 14,000 ఓట్లతో మూడో స్థానానికే పరిమితమయ్యారు. గత 2021 ఎన్నికల్లో ఇదే నియోజకవర్గం నుంచి స్టాలిన్ 70,000 పైచిలుకు ఓట్ల మెజార్టీతో గెలవడం గమనార్హం. ఓటమి అనంతరం స్టాలిన్ సీఎం పదవికి రాజీనామా చేసి గవర్నర్‌‌‌‌‌‌‌‌కు సమర్పించారు.   

వీఎస్ బాబు ప్రస్థానమిది

సీఎంను ఓడించిన 75 ఏండ్ల వీఎస్ బాబుకు రాజకీయాల్లో సుదర్ఘ అనుభవం ఉంది. గతంలో డీఎంకే, ఏఐఏడీఎంకే పార్టీల్లో కీలక బాధ్యతలు నిర్వహించారు. 2006 నుంచి-2011 మధ్య పురసైవాక్కం ఎమ్మెల్యేగా పనిచేశారు. డీఎంకే ఉత్తర చెన్నై జిల్లా కార్యదర్శిగా వ్యవహరించారు. 2011 ఎన్నికల సమయంలో కొలత్తూర్‌‌‌‌‌‌‌‌ నియోజకవర్గాన్ని బాబు పర్యవేక్షించారు. నాడు తన తక్కువ మెజార్టీకి బాబునే కారణమని స్టాలిన్ ఆరోపించడంతో డీఎంకే నుంచి ఆయన వైదొలిగారు. ఈ ఏడాది విజయ్ టీవీకేలో చేరారు. ప్రస్తుతం ఆ పార్టీ జాయింట్ జనరల్ సెక్రటరీగా ఉన్నారు.          

ప్రజాతీర్పును గౌరవిస్తున్నాం

తమిళనాడు ఎన్నికల ఫలితాలపై ఎంకే స్టాలిన్ స్పందించారు. ప్రజా తీర్పును గౌరవిస్తున్నామని పేర్కొంటూ ‘ఎక్స్’ లో ఒక ప్రకటన విడుదల చేశారు. ‘‘ప్రజలు ఇచ్చిన తీర్పును మనస్ఫూర్తిగా అంగీకరిస్తున్నాం. ఈ ఎన్నికల్లో విజయం సాధించిన వారికి నా హృదయపూర్వక అభినందనలు. గత ఐదేండ్ల కాలంలో మేం అనేక ప్రాజెక్టులను పూర్తి చేసి, తమిళనాడు ప్రజలకు సుపరిపాలన అందించాం. రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అగ్రభాగాన నిలిపాం. మేం చేసిన అభివృద్ధి పనులు, సాధించిన విజయాలను వివరించి ప్రజలను ఓట్లు అడిగాం. సంక్షేమ పథకాలు నిరంతరాయంగా కొనసాగాలనే లక్ష్యంతోనే ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించాం. డీఎంకే నేతృత్వంలోని కూటమికి మద్దతు తెలిపి, ఓటు వేసిన తమిళ ప్రజలందరికీ నా ధన్యవాదాలు. నేను మాకు ఓటు వేసినవారు,  ఓటు వేయని వారిని కూడా కలుపుకుని అందరి క్షేమం కోసం పాలన అందించాను’’ అని స్టాలిన్ పేర్కొన్నారు.