హిందీకి వ్యతిరేకంగా కాదు.. హిందీని బలవంతంగా రుద్దటంపైనే వ్యతిరేకం : సీఎం స్టాలిన్

హిందీకి వ్యతిరేకంగా కాదు.. హిందీని బలవంతంగా రుద్దటంపైనే వ్యతిరేకం : సీఎం స్టాలిన్

తమిళనాడులో హిందీ వ్యతిరేక ఉద్యమం మరోసారి ఊపందుకునేలా ఉంది. కేంద్రం తీసుకొచ్చిన నూతన విద్యా విధానం, హిందీ భాషను తప్పనిసరి చేయడంపై ఇప్పటికే సీఎం స్టాలిన్, ఉపముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ ఘాటుగా స్పందించారు. దీంతో ఇటీవల తమిళ్ వర్సెస్ హిందీ అన్నట్లుగా రాష్ట్రంలో పరిస్థితులు మారిపోయాయి. తమిళులపై హిందీని బలవంతంగా రుద్దుతున్నారని ఏకంగా బీజేపీ నేత, నటి రంజనా నాచియార్ పార్టీకి రాజీనామా చేశారంటే అక్కడ పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.

తమిళనాడులో పెరిగిపోతున్న హిందీ వ్యతిరేక ఉద్యమంపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి స్టాలిన్ స్పందించారు. తాము హిందీకి వ్యతిరేకం కాదని, కానీ బలవంతంగా రుద్దటంపైనే తాము వ్యతిరేకమని స్పష్టం చేశారు. డీఎంకే క్యాడర్ కు రాసిన బహిరంగ లేఖలో పార్టీ ధోరణిపై క్లారిటీ ఇచ్చారు. 

‘‘తమిళనాడు ఏ భాషకూ వ్యతిరేకం కాదు. అదే విధంగా ఏ భాషనూ నాశనం చేయాలని చూడదు. కానీ.. ఏదైనా భాష తమ మాతృ భాషను డామినేట్ చేస్తుందంటే తమిళులు కచ్చితంగా వ్యతిరేకిస్తారు’’అని ఆయన లేఖలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా ద్రవిడియన్ ఉద్యమం గురించి గుర్తు చేశారు. పిటి త్యాగరయార్ వంటి నేతలు సంస్కృతాన్ని గౌరవించారని, కానీ తమిళ విషయంలో రాజీ పడలేదని తెలిపారు. 

‘‘మా పైన హిందీని రుద్దకపోతే.. మేము వ్యతిరేకించం. తమిళుల ఆత్మగౌరవం దెబ్బతీసే ఏ అంశాన్నైనా మేము సంహించం’’అని స్పష్టం చేశారు సీఎం స్టాలిన్. ఈ సందర్భంగా హిందీ వ్యతిరేక ఉద్యమాలను గుర్తు చేశారు. 1937-39 ఉద్యమంలో పెరియార్ (ఈ.వి.రామస్వామి) వంటి నేతలు చేసిన పోరాటాన్ని గుర్తు చేశారు. 

యూపీలో తమిళ్, తెలుగు భాషల్లో బోర్డులు పెట్టగలరా:

దక్షిణ భారత యాత్రకు వచ్చే టూరిస్టులకు, ఇతరులకు రైల్వే స్టేషన్లలో హిందీలో బోర్డులు లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారని, తమిళ్ అర్థం కాకపోవడం సమస్యగా మారిందని, ఈ విషయంలో ప్రభుత్వం మొండిగా వ్యవహరించకూడదని ఇటీవల బీజేపీ నేతలు విమర్శించారు. ఈ వ్యాఖ్యలకు ఘాటుగా స్పందించారు సీఎం. ‘‘మీరు ఉత్తరప్రదేశ్ లో తమిళ్, తెలుగుతో పాటు ఇతర భాషలలో బోర్డులు పెట్టగలరా. ఇతర భాషలలో రైల్వే స్టేషన్లలో అనౌన్స్ మెంట్ చేయగలరా.. కుంభమేళా, అయోధ్య, కాశీ మొదలైన ప్రదేశాలలో ద్రవిడ భాషల బోర్డు పెట్టగలరా. ఒక వేళ మీరు సౌత్ ఇండియన్ భాషలలో బోర్డులు ఏర్పాటు చేస్తే మేము ఇక్కడ హిందీలో బోర్డులు ఏర్పాటు చేస్తాం’’అని బీజేపీ విమర్శలను తిప్పి కొట్టారు. 

త్రిభాష విధానం (మూడు భాషల విధానం) పేరుతో హిందీ, సంస్కృతాన్ని రుద్దాలని చూస్తున్నారని ఈ సందర్భంగా విమర్శించారు. తమిళనాడు అభివృద్ధికి, విద్య, ఉద్యోగ అవకాశాల పెంపు కోసం తమిళనాడు ద్విభాష విధానాన్ని అనుసరిస్తోందని, తమిళ్, ఇంగ్లీష్ భాషలలో బోధన ద్వారా స్కిల్ డెవలప్ మెంట్, ఎంప్లాయిమెంట్ పెరుగుతున్నాయని నొక్కి చెప్పారు. తమిళ భాషను కాపాడుకోవడానికి కావాల్సిన అన్ని చర్యలు తీసుకుంటామని, బలవంతంగా ఏదైనా రుద్దుతే కచ్చితంగా వ్యతిరేకిస్తామని స్పష్టం చేశారు.