
- ప్రధాని మోదీకి తమిళనాడు సీఎం స్టాలిన్ హెచ్చరిక
చెన్నై: పాలనపై దృష్టి పెట్టకుండా ప్రత్యర్థుల్ని టార్గెట్ చేస్తే ఒంటరిగా మిగిలిపోతారని ప్రధాని మోదీని తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ హెచ్చరించారు. ఈ మేరకు బుధవారం ఆయన ట్వీట్ చేశారు. ‘‘ఎన్నికలు అయిపోయాయి. ఇప్పుడు దేశం గురించి ఆలోచించాలి. 2024 బడ్జెట్- మీ ప్రభుత్వాన్ని కాపాడుతుంది. కానీ, ఈ దేశాన్ని కాదు. ప్రభుత్వాన్ని నిష్పక్షపాతంగా నడపండి. మిమ్మల్ని ఓడించిన వారిపై ప్రతీకారం తీర్చుకోవాలని అనుకోవద్దు.
రాజకీయాల కోసం ప్రభుత్వాన్ని నడిపితే మీరు ఒంటరిగా మిగిలిపోతారు’’ అని తెలిపారు. కేంద్ర బడ్జెట్‌పై స్టాలిన్ అసంతృప్తి వ్యక్తం చేశారు. చెన్నై మెట్రో రైల్ సెకండ్ ఫేజ్, కోయంబత్తూరులో ఇన్ ఫాస్ట్రక్చర్ ప్రాజెక్టుల ప్రస్తావన బడ్జెట్‌లో లేదన్నారు. స్టాలిన్ వ్యాఖ్యలపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై స్పందిస్తూ.. కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ–1, యూపీఏ–2 ప్రభుత్వాలు గతంలో సమర్పించిన 10 బడ్జెట్లలో ఆరింటిలో తమిళనాడు ప్రస్తావనే లేదని గుర్తుచేశారు.