ఇక నుంచి రోజుకు 5 షోలు: సినిమా థియేటర్లకు విజయ్ సర్కార్ బంపరాఫర్

ఇక నుంచి రోజుకు 5 షోలు: సినిమా థియేటర్లకు విజయ్ సర్కార్ బంపరాఫర్

సినిమా థియేటర్లకే కాదు.. సినిమా అభిమానులకు బంపరాఫర్ ఇచ్చింది తమిళనాడు కొత్త ప్రభుత్వం. ఇప్పటి వరకు దేశంలోని మెజారిటీ రాష్ట్రాల్లోని సినిమా థియేటర్లో రోజుకు నాలుగు షో మాత్రమే పడేవి. ఏదైనా కొత్త సినిమా రిలీజ్ అయినప్పుడు ఆ సినిమా టీం ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తే అదనపు షోలకు పర్మిషన్లు ఇవ్వడం మనం చూస్తునే ఉన్నాం.

మార్నింగ్ షో, మ్యాట్నీ, ఫస్ట్ షో.. సెకండ్ షో.. ఇప్పటి వరకు ఇది కామన్.. రెగ్యులర్. తమిళనాడులో ఇప్పుడు ఈ విధానం మారింది. కొత్త సినిమా విడుదలైన వారం రోజుల వరకూ ఐదు షోలు ప్రదర్శించుకునేందుకు విజయ్ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.

రోజుకు ఐదు ఆటలు వేసుకోవచ్చని.. టైమింగ్స్ మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చని స్పష్టం చేస్తూ సీఎం విజయ్ ప్రభుత్వం కొత్త నిర్ణయం ప్రకటించింది. స్వతహాగా సినీ నటుడు అయిన తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ జోసెఫ్ సినీ పరిశ్రమకు భారీ ప్రయోజనం చేకూరేలా ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇకపై.. తమిళనాడులోని సింగిల్ స్క్రీన్ థియేటర్లలో కొత్త సినిమాలు రిలీజైతే.. వారం రోజుల వరకూ రోజుకు 4 షోలకు బదులుగా ఐదు షోలు ప్రదర్శించుకునేందుకు విజయ్ TVK సర్కార్ అనుమతించింది. విజయ్ ప్రభుత్వం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.

ఇకపై.. అదనపు షోల కోసం ప్రభుత్వాలను అభ్యర్థించాల్సిన అవసరం సినీ నిర్మాతలకు లేదు. ఈ మేరకు అనుమతి కోరుతూ.. మే 16న తమిళనాడు సినీ పరిశ్రమ ప్రతినిధులు ముఖ్యమంత్రి విజయ్ను కలిశారు. విజయ్ ప్రభుత్వం ఈ అభ్యర్థనపై సానుకూలంగా స్పందించింది. కొత్తగా విడుదలైన తమిళ చిత్రాలను విడుదల తేదీ నుంచి ఏడు రోజుల పాటు రోజుకు ఐదు షోలు ప్రదర్శించడానికి థియేటర్లను అనుమతించేలా తమిళనాడు సినిమాస్ (రెగ్యులేషన్) రూల్స్‌లో చేసిన సవరణలను ముఖ్యమంత్రి ఆమోదించారు.