2020లో తమిళనాడులోని సాత్తాన్‌కుళం పోలీస్ స్టేషన్ సాక్షిగా జరిగిన తండ్రీకొడుకుల అమానవీయ హత్యోదంతం నాగరిక సమాజం నిర్ఘాంతపోయేలా చేసింది. అహంకారంతో సాగిన పోలీసు దౌర్జన్యంపై మద్రాస్ హైకోర్టు స్పందించి ఈ కేసును సుమోటోగా స్వీకరించి పోలీసుల గుండెల్లో వణుకు పుట్టించింది. వ్యవస్థలోని లోపాలను ఎండగడుతూ, తోటి అధికారుల బెదిరింపులకు లొంగకుండా అదే పోలీస్ స్టేషన్లో పనిచేసే మహిళా హెడ్ కానిస్టేబుల్ రేవతి చూపిన అసాధారణ ధైర్యం ఈ కేసులో న్యాయం గెలవడానికి పునాది వేసింది.
దాదాపు ఆరేండ్ల న్యాయ పోరాటం తర్వాత అమానీయంగా ప్రవర్తించిన 9మంది పోలీసులకు మరణశిక్ష విధిస్తూ వెలువడిన ఈ తీర్పు.. ఖాకీ డ్రెస్ వేసుకున్నంత మాత్రాన చట్టం కంటే ఎవరూ ఎక్కువ కాదని చాటిచెప్పింది. 2020లో తమిళనాడులో జరిగిన తండ్రీకొడుకుల లాకప్ డెత్ ఉదంతం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. 2020 జూన్ 19న కరోనా లాక్‌డౌన్ ఆంక్షలు అమల్లో ఉన్న తరుణంలో సాత్తాన్‌కుళంలో కామరాజ్ చౌక్‌లో మొబైల్ షాపు నడుపుకుంటున్న పి. జయరాజ్(58)ను షాపు 15 నిమిషాలు ఆలస్యంగా మూశారని ఆరోపిస్తూ.. పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత తండ్రిని చూడడానికి కొడుకు స్టేషన్‌కు వచ్చాడు. అక్కడ తండ్రిని కొట్టడం చూసి అడ్డుకోబోయాడు. దీంతో పోలీసులు ఇద్దరినీ లోపలికి తీసుకెళ్లి రాత్రి నుంచి మరుసటి రోజు ఉదయం 3 గంటల వరకు వారిపై అమానవీయంగా, పాశవికంగా దాడి చేశారు. స్టేషన్ తలుపులు మూసేసి.. ఇద్దరి బట్టలు విప్పి.. కర్రలు, ఇతర వస్తువులతో తీవ్రంగా కొట్టారు. మల ద్వారంలో రాడ్లు చొప్పించి దౌర్జన్యానికి పాల్పడ్డారని కుటుంబ సభ్యులు చెప్పారు. పోలీసులకు వ్యతిరేకంగా మాట్లాడారన్న కారణంతోనే ఇలా దాడి చేశారని వారు తెలిపారు. ఆ తర్వాత వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచి జైలుకు తరలించారు. జూన్ 22న తండ్రీకొడుకులు ఆస్పత్రిలో మరణించారు.
మద్రాస్ హైకోర్టు విచారణకు
స్వీకరించడంతో కీలక మలుపు
ఈ లాకప్ డెత్‌లపై సామాజిక కార్యకర్తలు, మానవ హక్కుల సంఘాలు పెద్ద ఎత్తున నిరసన తెలిపాయి. మద్రాస్ హైకోర్టు మదురై బెంచ్ సుమోటోగా కేసు స్వీకరించి సీబీఐకి అప్పగించింది. ఒకవేళ కోర్టు ఈ కేసును టేకప్ చేయకపోతే.. అన్ని కేసుల్లాగే ఈ కేసును కూడా పోలీసులు నీరుగార్చేవారు. హైకోర్టు కేవలం విచారణకు ఆదేశించి వదిలేయకుండా నిరంతరం మానిటర్ చేయడం ద్వారా భారత జ్యుడీషియరీలో ప్రజల హక్కులను రక్షించడంలో కోర్టులు స్వయంగా ముందుకొస్తే ఎలాంటి ఫలితాలు ఉంటాయో నిరూపించింది. కాగా.. సీబీఐ దర్యాప్తులో విస్తుపోయే నిజాలు తెలిశాయి. కేవలం పోలీసుల అహంకారానికి తండ్రీకొడుకులు బలయ్యారని స్పష్టమైంది. కేవలం వారు ఎదురు తిరిగారన్న కోపంతో పోలీసులు ఈ దారుణానికి ఒడిగట్టారని తేల్చింది. అమాయక ప్రాణాలు కేవలం పోలీసుల అహంకారం వల్ల గాలిలో కలిసిపోవడం అత్యంత దారుణం.
చారిత్రక తీర్పు..
దాదాపు ఆరేండ్ల సుదీర్ఘ విచారణ అనంతరం ఏప్రిల్ 6న తమిళనాడు మదురై జిల్లా అదనపు జిల్లా సెషన్స్ కోర్టు ఇచ్చిన తీర్పు భారత న్యాయ చరిత్రలో మైలురాయిగా నిలిచిపోయింది. సాత్తాన్‌కుళం పోలీస్ స్టేషన్‌లో పనిచేసిన తొమ్మిది మంది పోలీసు అధికారులు, కానిస్టేబుళ్లు కలిసి జయరాజ్, అతని కుమారుడు ఫెన్నిక్స్ను హత్య చేశారని కోర్టు తేల్చిచెప్పింది. ఈ భయంకరమైన లాకప్‌డెత్ కేసులో 9 మంది పోలీసు అధికారులకు మరణశిక్ష విధించింది. మొత్తం
రూ. 1.40 కోట్ల జరిమానా విధించి, అది బాధిత కుటుంబాలకు పరిహారంగా చెల్లించాలని ఆదేశించింది. ఇది ‘రేరెస్ట్ ఆఫ్ రేర్' కేసు అని జడ్జి చెప్పడం బట్టి ఆ లాకప్ డెత్ కేసు సమాజాన్ని ఎంత భయాందోళనకు గురిచేసేదిగా ఉందో అర్థమవుతుంది.
మహిళా హెడ్ కానిస్టేబుల్ రేవతి ధైర్యం
ఈ కేసులో సాత్తాన్‌కుళం స్టేషన్‌లోని మహిళా హెడ్ కానిస్టేబుల్ రేవతి ధైర్యాన్ని తప్పకుండా చెప్పుకోవాలి. ఈ కేసు బయటపడటానికి కీలక సాక్షి ఆమె. రేవతి సాక్ష్యమే ఈ కేసును కీలక మలుపుతిప్పింది. తోటి పోలీసులు అమాయకులను దారుణంగా హింసిస్తుంటే కళ్లారా చూసిన ఆమె మానవత్వంతో కోర్టులో నిజం చెప్పారు. ఆ రాత్రి ఆమె స్టేషన్‌లో ఉండి.. ఆ దౌర్జన్యాన్ని రాత్రంతా కళ్లారాచూసి సాక్ష్యం చెప్పారు. తోటి పోలీసులు, సీనియర్ అధికారుల నుంచి బెదిరింపులు వచ్చినా, తన వృత్తి ధర్మాన్ని నెరవేరుస్తూ ఆమె చెప్పిన సాక్ష్యమే ఆ 9 మంది పోలీసులకు శిక్ష పడటంలో ప్రధాన పాత్ర పోషించింది. ఆమె చూపిన ధైర్యం పోలీసు వ్యవస్థలో ఇంకా మానవత్వం బతికే ఉందని చాటిచెప్పింది. రేవతి ధైర్యం చేయకపోతే ఈ కేసును కూడా ‘నేచురల్ డెత్’ అని మూసేసేవారు. కోర్టు తీర్పు తర్వాత రేవతి.. ఒక సామాన్య పోలీసుగానే కాకుండా.. న్యాయం కోసం తన ఉద్యోగం, భద్రతను పణంగా పెట్టిన ధీరవనితగా నిలిచారు.
నేటి పోలీసులకు ఇదొక పాఠం
ఈ తీర్పు కేవలం 9 మందికి పడిన శిక్ష మాత్రమే కాదు.. యూనిఫాం వేసుకున్న ప్రతి ఒక్కరికీ హెచ్చరిక. చట్టం అందరికీ సమానమే. రక్షించాల్సిన వారే భక్షకులుగా మారితే చట్టం ఎంత కఠినంగా ఉంటుందో ఈ తీర్పు నిరూపించింది. నిందితుడిని కూడా మనిషిలా చూడాలి తప్ప, అధికారం ఉంది కదా అని ప్రాణాలు తీసే హక్కు ఎవరికీ లేదని కోర్టు తీర్పు స్పష్టం చేసింది. ఈ తీర్పు కేవలం ఒక కేసు ముగింపు కాదు. ఈ చారిత్రాత్మక తీర్పు భారత న్యాయవ్యవస్థపై ప్రజల్లో నమ్మకాన్ని పెంచడమే కాకుండా, రాబోయే రోజుల్లో లాకప్ డెత్‌లు తగ్గడానికి ఒక బలమైన పునాదిగా నిలుస్తుందని ఆశిద్దాం.
- గొడిశాల
రమేశ్ బాబు
సీనియర్ జర్నలిస్ట్
ఓపెన్ పేజీకి వ్యాసాలు, లెటర్లు పంపాల్సిన మెయిల్ ఐడీ
openpage@v6velugu.com
రచయితలు ‘వెలుగు’ కు మాత్రమే పంపుతున్నామని
హామీ తప్పనిసరి రాయాలి. స్వీయ రచన అయి ఉండాలి.
రచన 700 పదాలకు మించరాదు.
