మాల్స్, హోటల్స్ లోకి వెళ్ళాలంటే ఆంక్షలు

మాల్స్, హోటల్స్ లోకి వెళ్ళాలంటే ఆంక్షలు

సౌతాఫ్రికాలో వేగంగా వ్యాపిస్తున్న ఒమిక్రాన్ కేసులు ఇండియాలో కూడా నమోదవుతున్నాయి. తాజాగా కర్నాటకలో రెండు కేసులు బయటపడ్డాయి. దాంతో పలు రాష్ట్రాలు ముందస్తు చర్యలకు దిగుతున్నాయి. ఈ క్రమంలోనే తమిళనాడులోని మధురైలో కొత్త ఆంక్షలు విధించారు. వ్యాక్సిన్ తీసుకోని వ్యక్తులకు వచ్చే వారం నుంచి షాపింగ్ మాల్స్, హోటల్స్ లోకి అనుమతి ఉండదని ప్రకటించారు. ఈ నిబంధన అమలులోకి రావడానికి ముందే వ్యాక్సిన్ తీసుకోని వారు కనీసం ఒక్క డోస్ అయినా తీసుకోవాలని జిల్లా యంత్రాంగం తెలిపింది. 

‘మధురైలో దాదాపు 3 లక్షల మందికి కోవిడ్ వ్యాక్సిన్ ఒక్క డోస్ కూడా అందలేదు. జిల్లాలో 71.6 శాతం మంది మొదటి డోస్‌, 32.8 శాతం మంది రెండో డోస్‌ తీసుకున్నారు. రెండో డోస్ గడువు ముగిసినా ఇంకా 3 లక్షల మంది టీకాలు తీసుకోలేదు. కనీసం ఒక్క డోస్ కూడా తీసుకోని వారికి వారం గడువు ఇస్తున్నాం. ఈ లోగా ఫస్ట్ డోస్ వ్యాక్సిన్ తీసుకోకపోతే వారందరికీ హోటళ్ళు, షాపింగ్ మాల్స్ మరియు ఇతర వాణిజ్య సంస్థల వంటి బహిరంగ ప్రదేశాల్లోకి ప్రవేశం ఉండదు’ అని మధురై కలెక్టర్ అనీష్ శేఖర్ చెప్పారు.

రెండు ఒమిక్రాన్ కేసులు గుర్తించిన కర్ణాటకలో శుక్రవారమే ఈ ఆంక్షలను ప్రకటించింది. మాల్స్, థియేటర్లు మరియు సినిమా హాల్స్ వంటి బహిరంగ ప్రదేశాల్లోకి ప్రవేశించడానికి రెండు డోసుల టీకాను తప్పనిసరి చేస్తూ ఆదేశాలు జారీ చేసింది.