హాల్ లో టైల్స్ కిందకు జారీ.. ఇంట్లో భారీ గుంత

హాల్ లో టైల్స్ కిందకు జారీ.. ఇంట్లో భారీ గుంత

 

తమిళనాడు రాష్ట్రాన్ని భారీ వర్షాలు కుదిపేస్తున్నాయి. వరదలతో అనేక ప్రాంతాల ప్రజలు భయంతో వణుకుతున్నారు. ఇప్పటికే అనేక ప్రాంతాల జనం నిలువ నీడ లేకుండా పోయారు. తాజాగా భారీ వర్షాలకు ఓ ఇంట్లో భారీగా గోయి ఏర్పడింది. తమిళనాడులోని చెంగల్పట్టు జిల్లాలో గత రెండు వారాలకు పైగా ఎడతెరిపి లేకుండా వానలు పడుతున్నాయి. వర్షాల కారణంగా జిల్లాలో నదులు, వాగులు, వంకలు వరద నీటితో పొంగి పొర్లుతున్నాయి. చెరువుల్లో నీటిమట్టాలు పూర్తిసామర్ధ్యానికి పెరిగాయి.

ఈ నేపథ్యంలో, నందివరం ఊరపాక్కం చెరువు నుంచి విడుదల చేస్తున్న మిగులు జలాలు జగదీశ్‌నగర్‌ ప్రాంతంలో ఉన్న నివాస ప్రాంతాల్లోకి చేరింది. మరోవైపు జగదీశ్‌నగర్‌ రెండవ వీధిలోని ఓ అపార్ట్‌మెంట్‌ వెనుక అడయార్‌ కాలువ ప్రవహిస్తోంది. ఈ కాలువలో వరద నీరు ఉధృత రూపం దాల్చింది. దీంతో అక్కడే కాలువ సమీపంలో నివసిస్తున్న గుణశేఖరన్‌ అనే వ్యక్తి ఇంటి గదిలో ఉన్నట్టుండి పదడుగుల గుంత ఏర్పడింది.  ఇంట్లో ఉన్న హల్ లోని టైల్స్ అన్ని కిందకు పడిపోయాయి. అక్కడ భారీగా గుంత ఏర్పడింది.  ఆ గుంతలో వరద నీరు రావడం చూసి గుణశేఖరన్‌ కుటుంబ సభ్యులు, చుట్టుపక్కల నివసిస్తున్న వారు ఆందోళనకు గురయ్యారు. టైల్స్ కిందకు జారీ వాటిపై నుంచి వరద నీరు ప్రవహించడాన్ని చూసి షాక్ అయ్యారు. వెంటనే అధికారులకు సమాచారం అందించారు. 

మురికి కాలువలు, డ్రైనేజీలపై కూడా భవనాలు కట్టడం వల్లే ఇలాంటి ఘటనలు చోటు చేసుకున్నాయని పలువును నిపుణులు అభిప్రాయ పడుతున్నారు. వరద నీరు వెళ్లడానికి సరైన దారి లేకనే... ఇలా ఇంట్లోనే గుంత ఏర్పడిందని వారు చెబుతున్నారు. అయితే ఇంటి యజమాని మాత్రం.. తమ ప్రాంతంలో ఇటీవల జరిగిన అక్రమ నిర్మాణమే తన ఇంట్లో గుంత ఏర్పడటానికి కారణమని చెబుతున్నారు. పక్కనే భవనం నిర్మించిన వాళ్లే మురికి కాలువను మూసివేశారన్నారు. దాన్ని వల్ల వరద నీరు దారి మళ్లిందని ఆరోపించారు. మరోవైపు అధికారులు కూడా తమను ఏ మాత్రం పట్టించుకోవడం లేదని విమర్శించారు.