మాతృభూమిని మరవొద్దు..IIT స్టూడెంట్స్ కు మోడీ పిలుపు

మాతృభూమిని మరవొద్దు..IIT స్టూడెంట్స్ కు మోడీ పిలుపు
  • ఐఐటీ స్టూడెంట్లకు ప్రధాని మోడీ పిలుపు

చెన్నై‘‘మీరు ఎప్పుడెప్పుడు గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకుని వస్తారా అని ఎన్నో గొప్ప అవకాశాలు ఎదురుచూస్తున్నాయి. వాటిని ఉపయోగించుకోండి. కానీ ఒక రిక్వెస్ట్. మీరు ఎక్కడ పని చేస్తున్నా, ఎక్కడ బతుకుతున్నా.. ఒక్క విషయం మాత్రం మరిచిపోకండి. మాతృభూమి అవసరాలను గుర్తుపెట్టుకోండి. మీరు చేసే పని, రీసెర్చ్, ఇన్నొవేషన్.. ఇంకేదైనా సరే ఓ ఇండియన్​కు ఎలా ఉపయోగపడుతోందో ఆలోచించండి” అని ఐఐటీ స్టూడెంట్లకు ప్రధాని నరేంద్ర మోడీ పిలుపునిచ్చారు. సోమవారం చెన్నైలోని ఐఐటీ మద్రాస్‌‌‌‌‌‌‌‌ 56వ కాన్వొకేషన్​కు మోడీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇన్నొవేషన్ ప్రపంచవ్యాప్తంగా ఇండియన్ కమ్యూనిటీ తన ముద్ర వేసిందన్నారు. ‘‘అమెరికా పర్యటనలో ఎంతో మంది నేతలను, వ్యాపారవేత్తలను కలిశాను. చర్చలు జరుపుతున్నప్పుడు వారిలో.. ‘కొత్త ఇండియా’ విషయంలో ఆశావాద దృక్పథం కనిపించింది. ఇండియా యువతపై వాళ్లకున్న కాన్ఫిడెన్స్ కనిపించింది” అని మోడీ అన్నారు.

ప్రపంచంపై ముద్ర వేశారు..

‘‘ప్రపంచవ్యాప్తంగా ఇండియన్ కమ్యూనిటీ తన ముద్ర వేసింది. ముఖ్యంగా సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇన్నొవేషన్ విషయంలో చెరిగిపోని మార్క్ వేసింది. ఇందులో ‘మీ ఐఐటీ సీనియర్ల’  పాత్ర ఎంతో ఉంది. మీరు ప్రపంచవ్యాప్తంగా బ్రాండ్ ఇండియాను మరింత బలోపేతం చేస్తున్నారు’’ అని చెప్పారు. ‘‘యూపీఎస్సీకి సెలెక్ట్ అవుతున్న వారిలోనే ఎంతో మంది ఐఐటీ గ్రాడ్యుయేట్లు ఉంటున్నారు. కార్పొరేటు ప్రపంచంలోనూ ఐఐటీయన్లే. ఈ ఇన్​స్టిట్యూట్లలో చదువుతున్న స్టూడెంట్లు.. ఇండియాను మరింత అభివృద్ధి చేస్తున్నారు. సంపన్న దేశంగా మారుస్తున్నారు” అని వివరించారు. ‘‘డిగ్రీ పూర్తయి వర్సిటీ నుంచి బయటికెళ్లే స్టూడెంట్లు.. కాలేజీ లైఫ్​ను మిస్ అవుతారు. క్యాంపస్​కు దూరమవుతారు. అయితే ఇకపై ఎలాంటి భయం లేకుండా క్వాలిటీ ఉన్న చెప్పులను కొనుక్కోవచ్చు’’ అని చమత్కరించారు. దీంతో స్టూడెంట్లందరూ గట్టిగా నవ్వారు. స్టూడెంట్లు ఫిట్​గా ఉండాలని, పనిలో పడి ఆరోగ్యం విషయంలో నిర్లక్ష్యంగా ఉండొద్దని కోరారు.