తమిళనాడులో విజిల్.. బెంగాల్లో కమాల్..దుమ్మురేపిన విజయ్ పార్టీ.. దీదీ ఇలాకాలో చరిత్ర సృష్టించిన బీజేపీ

తమిళనాడులో విజిల్..  బెంగాల్లో కమాల్..దుమ్మురేపిన విజయ్ పార్టీ.. దీదీ ఇలాకాలో చరిత్ర సృష్టించిన బీజేపీ
  • దుమ్మురేపిన విజయ్ పార్టీ.. దీదీ ఇలాకాలో చరిత్ర సృష్టించిన బీజేపీ 
  • కేరళలో కాంగ్రెస్ కూటమి విజయం.. అస్సాంలో బీజేపీ హ్యాట్రిక్ 
  • పుదుచ్చేరిలో మళ్లీ ఎన్డీయే సర్కారుకే పట్టం
  • నాలుగు రాష్ట్రాలు, ఒక యూటీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు విడుదల 
  • తమిళనాడులో 234 సీట్లకు107 సీట్లతో టీవీకే విజయం.. డీఎంకేకు 60 స్థానాలే.. హంగ్ సర్కార్​కు చాన్స్ 
  • బెంగాల్​లో 293 సీట్లకు బీజేపీకి 206 స్థానాలు.. 81 సీట్లకు పడిపోయిన టీఎంసీ  
  • అస్సాంలో 126 స్థానాలకు ఎన్డీయేకు 102 సీట్లు.. 21కే పరిమితమైన కాంగ్రెస్  
  • కేరళలో 140 సీట్లకు 102 స్థానాల్లో యూడీఎఫ్ గెలుపు.. 35కు పడిపోయిన ఎల్డీఎఫ్​  
  • బెంగాల్ లో కొత్త అధ్యాయం: ప్రధాని మోదీ 
  • 100 సీట్లలో లూటీ చేసి గెలిచారు: మమత 
  • అస్సాం, బెంగాల్​లో బీజేపీ ఓట్ల చోరీ: రాహుల్ గాంధీ 


న్యూఢిల్లీ:  తమిళనాడులో నటుడు విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కజగం(టీవీకే) పార్టీ అరంగేట్రంలోనే అదరగొట్టింది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ప్రభంజనం సృష్టించింది. తొలి ప్రయత్నంలోనే అద్భుత విజయంతో అధికారానికి చేరువైంది. పశ్చిమ బెంగాల్​లో బీజేపీ కూడా కమాల్ చేసింది. అధికార టీఎంసీతో హోరాహోరీగా సాగిన పోరులో బంపర్ మెజార్టీ సాధించి మొట్టమొదటిసారిగా పవర్​ను చేజిక్కించుకుంది. అస్సాంలోనూ కమలం పార్టీ హ్యాట్రిక్ కొట్టింది. పుదుచ్చేరిలో సైతం ఎన్డీయే కూటమి పవర్ ను నిలబెట్టుకుంది. ఇక కేరళలో కాంగ్రెస్ కూటమి ఘన విజయం సాధించింది. ఎల్డీఎఫ్​ను సాగనంపి, అధికారాన్ని తిరిగి హస్తగతం చేసుకుంది. సోమవారం నాలుగు రాష్ట్రాలు, ఒక యూటీ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపును చేపట్టిన ఎన్నికల సంఘం(ఈసీ) ఫలితాలను ప్రకటించింది. తమిళనాడులో విజయ్ టీవీకే పార్టీ మొత్తం 234 సీట్లకుగాను107 సీట్లలో జయకేతనం ఎగురవేసింది. రాష్ట్రంలో అధికార డీఎంకే పార్టీ 60 స్థానాలకు, ప్రతిపక్ష అన్నాడీఎంకే 47 సీట్లకు పరిమితమయ్యాయి. సీఎం స్టాలిన్ సైతం ఓడిపోవడం డీఎంకేకు మరో పరాభవంగా నిలిచింది. 

అయితే, టీవీకే అతిపెద్ద పార్టీగా అవతరించినప్పటికీ మ్యాజిక్ ఫిగర్‌(118 సీట్లు)కు మరో11  సీట్ల దూరంలో నిలిచిపోయింది. దీంతో రాష్ట్రంలో హంగ్ అసెంబ్లీ ఏర్పడే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో అద్భుత విజయంతో బీజేపీ చరిత్ర సృష్టించింది. టీఎంసీ అధినేత మమతా బెనర్జీ సర్కారు15 ఏండ్ల పాలనకు చరమగీతం పాడింది. రాష్ట్ర అసెంబ్లీలో మొత్తం 294 సీట్లకుగాను 293 స్థానాలకు ఫలితాలను ఈసీ ప్రకటించింది. బీజేపీ ఏకంగా 206 సీట్లలో గెలిచి తొలిసారి అధికారాన్ని చేజిక్కించుకుంది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు కనీస మెజార్టీ148 సీట్లను సునాయాసంగా దాటేసింది. టీఎంసీ 81 సీట్లకే పరిమితమైపోయింది.

 సీఎం మమతా బెనర్జీ కూడా బీజేపీ నేత సువేందు అధికారి చేతిలో ఓడిపోవడంతో ఆ పార్టీకి ఘోర పరాభవం ఎదురైంది. ఇక అస్సాంలో బీజేపీ వరుసగా మూడోసారి విజయ బావుటా ఎగురవేసింది. మొత్తం 126 సీట్లలో 81 చోట్ల కమలం పార్టీ మరో 20 చోట్ల మిత్రపక్షాలు గెలుపొందాయి. కాంగ్రెస్ పార్టీ 15 స్థానాలకే పరిమితమైంది. అలాగే, కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరిలో సీఎం ఎన్.రంగస్వామి నేతృత్వంలోని ఎన్డీయే కూటమికి ప్రజలు మళ్లీ పట్టం కట్టారు. మొత్తం 30 అసెంబ్లీ సీట్లకుగాను ఎన్డీయే కూటమి18 సీట్లు గెలుచుకుని, మరోసారి అధికారాన్ని నిలబెట్టుకుంది. ఇక కేరళలో కాంగ్రెస్​నేతృత్వంలోని యూడీఎఫ్ ఘన విజయం సాధించింది. దీంతో దేశంలోని చివరి కమ్యూనిస్ట్ ప్రభుత్వం కూలిపోయింది. రాష్ట్రంలో మొత్తం 140 అసెంబ్లీ స్థానాలకుగాను యూడీఎఫ్ 102 స్థానాల్లో గెలుపొందగా.. అధికార ఎల్‌డీఎఫ్ 35 స్థానాలకు పరిమితమైపోయింది. గత ఎన్నికల్లో ఒక్క సీటు కూడా గెలవని బీజేపీ ఈసారి 3 సీట్లను కైవసం చేసుకుంది.