
చెన్నై: తమిళనాడు మంత్రి సెంథిల్ బాలాజీ తన పదవికి రాజీనామా చేశారు. మనీలాండరింగ్ కేసులో అరెస్టయిన ఆయన ప్రస్తుతం జైలులో ఉన్నారు. బెయిల్ కోసం మద్రాస్ హైకోర్టులో ఆయన దాఖలు చేసిన పిటిషన్ మరో రెండు రోజుల్లో విచారణకు రానుంది. ఈ నేపథ్యంలో సెంథిల్ మంత్రి పదవికి రాజీనామా చేయడం చర్చనీయాంశంగా మారింది. న్యాయపరమైన చిక్కుల వల్లే బాలాజీ తన మంత్రి పదవికి రాజీనామా చేయాల్సి వచ్చినట్లు తెలుస్తోంది. గత అన్నాడీఎంకే ప్రభుత్వ హయాంలో బాలాజీపై చెన్నై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు డబ్బుకు ఉద్యోగం కుంభకోణం కేసు నమోదు చేశారు. అనంతరం మనీలాండరింగ్ కేసులో బాలాజీని ఈడీ అరెస్టు చేసింది. జైలులో ఉన్నప్పటికీ బాలాజీని ఏ శాఖను కేటాయించకుండా సీఎం స్టాలిన్ తన మంత్రివర్గంలోనే కొనసాగించారు. దీనిపై హైకోర్టు ఇటీవల అసంతృప్తి వ్యక్తంచేసింది. బాలాజీని మంత్రి పదవిలో కొనసాగించే విషయమై మరోసారి ఆలోచించాలని సీఎం సూచించింది. దీంతో బెయిల్ పిటిషన్ రెండోసారి హైకోర్టు ముందు విచారణకు రానున్న నేపథ్యంలో బాలాజీ మంత్రి పదవికి రాజీనామా చేశారు.