టైం అయిపోయినా షాపు మూయలేదని తండ్రీ కొడుకులని కొట్టి చంపిన పోలీసులు

టైం అయిపోయినా షాపు మూయలేదని తండ్రీ కొడుకులని కొట్టి చంపిన పోలీసులు

కర్ఫ్యూ టైంలో షాపు తెరచారని తండ్రీ కొడుకులని స్టేషన్ తీసుకెళ్లి చితక్కొట్టడంతో మరణించిన దారుణ సంఘటన తమిళనాడులో జరిగింది. ఈ  ఘటన తుత్తుకుడిలో జూన్ 24న జరిగింది. తుత్తుకుడికి చెందిని జయరాజ్ (60) మరియు ఆయన కొడుకు ఫీనిక్స్ (30) ఒక మొబైల్ దుకాణాన్ని నడుపుతున్నారు. ప్రస్తుతం తమిళనాడులో కరోనా విజృంభిస్తుండటంతో మళ్లీ లాక్డౌన్ విధించారు. ప్రతిరోజూ కొంతసమయం షాపులు తెరవడానికి ప్రభుత్వం అనుమతులిచ్చింది. దాంతో తండ్రీకొడుకులు కూడా తమ మొబైల్ షాపును తెరచారు. కానీ.. కర్ఫ్యూ మొదలయ్యే టైంకి మూయలేదు. దాంతో అటుగా వచ్చిన పోలీసులు.. జయరాజ్ ను ప్రశ్నించారు. పోలీసులకు, జయరాజ్ కు మధ్య వాగ్వాదం జరిగింది. దాంతో ఫీనిక్స్ కూడా కలగజేసుకొని పోలీసులతో మాట్లాడాడు. వెంటనే కోపోద్రిక్తులైన పోలీసులు.. వారిద్దరిని అదుపులోకి తీసుకొని సాతంకుళం పోలీసుస్టేషనుకు తీసుకెళ్లారు.

అనేకమంది ప్రత్యక్ష సాక్షుల ప్రకారం.. తండ్రీకొడుకులపై పోలీసులు తీవ్రంగా దాడిచేశారు. దాంతో వారిరువురు బాగా గాయపడ్డారు. ఆ తర్వాత వారిని కోవిల్పట్టి సబ్-జైలులో రిమాండుకు పంపించారు. అక్కడ తీవ్ర అస్వస్థతకు గురైన తండ్రీకొడుకులను పోలీసులు ఆస్పత్రికి తరలించి చికిత్స చేయించారు. ఆస్పత్రికి వెళ్లిన కాసేపటికే ఫీనిక్స్ మరణించాడు. మరికొన్ని గంటల తర్వాత జయరాజ్ కూడా మరణించాడు.

ఈ ఘటనపై తుత్తుకుడి మొత్తం ఆగ్రహజ్వాలలతో నిరసనలు రేకెత్తాయి. దాంతో ఈ కేసును సుమోటోగా స్వీకరించిన మద్రాస్ హైకోర్టు.. మృతుల పోస్టుమార్టంను వీడియో తీయాలని ఆదేశించింది. ఈ కేసుతో సంబంధమున్న పోలీసులిద్దరిని సస్పెండ్ చేస్తున్నట్లు తెలిపింది.

ఇద్దరు అమాయకులను పోలీసులు కొట్టి చంపిన ఈ ఘటనపై ముఖ్యమంత్రి పళనిస్వామి స్పందించి తక్షణ చర్యలు తీసుకోవాలని డీఎంకే అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత ఎంకె. స్టాలిన్ డిమాండ్ చేశారు. కె.ఎస్.అళగిరి, వైకో, జికె వాసన్ వంటి ముఖ్య రాజకీయ నాయకులు సోషల్ మీడియాలో ఈ సంఘటనను ఖండిస్తూ పోస్టులు పెట్టారు. అలాగే దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్, గాయని సుచిత్రా వంటి కోలీవుడ్ ప్రముఖులు కూడా కొన్ని వీడియోలను జతచేసి ట్వీట్లు పోస్ట్ చేశారు. తప్పు చేసిన పోలీసు అధికారులపై తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రముఖులందరూ ఈ ఘటనను వ్యతిరేకించడంతో సోషల్ మీడియాలో ఈ కేసు తెగ వైరల్ అయింది.

చిన్న దుకాణదారులపై జరిగిన ఈ దాడిని తమిళనాడు వర్తక సంఘం ఖండించింది. జయరాజ్ మరియు ఫీనిక్స్ లపై పోలీసుల దాడిని నిరసిస్తూ అసోసియేషన్ ఒక రోజు బందుకు పిలుపునిచ్చిందని తమిళనాడు ట్రేడర్స్ అసోసియేషన్ (టిఎన్‌టిఎ) అధ్యక్షుడు వెల్లయ్యన్ తెలిపారు. ఈ ఘటనపై ప్రజలెవరూ ఆందోళన చెందవద్దని ఆయన ప్రజలను కోరారు. పోలీసుల తీరు పట్ల రాష్ట్రమంతా నిరసనలు వెల్లువెత్తడంతో రాజకీయంగా దుమారం రేగింది. #JusticeForJayarajAndFenix

For More News..

దేశంలో 17 వేలు దాటిన కరోనా కేసులు

ఐటీ ఆన్‌లైన్‌ కోర్సులకు మస్తు డిమాండ్

చైనా మాల్‌ తగ్గించేందుకు కొత్త ప్లాన్

‘ఆర్ఆర్ఆర్’ లో భగత్ సింగ్ గా అజయ్ దేవగన్