పేదోళ్లైతే ఎన్​కౌంటర్ పెద్దలైతే నిర్దోషులా?

పేదోళ్లైతే ఎన్​కౌంటర్ పెద్దలైతే నిర్దోషులా?
  • మైనర్​పై ​రేప్ ఘటనలో సర్కార్ తీరు సరిగాలేదు:తమ్మినేని

యాదాద్రి, వెలుగు: శాంతిభద్రతల్లో కూడా పక్షపాతం చూపించడం ఈ టీఆర్​ఎస్ సర్కారుకే చెల్లిందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. పేదలైతే ఎన్​కౌంటర్ చేస్తూ.. పెద్దోళ్లైతే నిర్దోషులని కితాబిస్తున్నదని ఆరోపించారు. రాయగిరిలో సీపీఎం నిర్వహిస్తున్న రాజకీయ శిక్షణ తరగతుల్లో పాల్గొన్న తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. ‘దిశ’ హత్యాచార ఘటనలో నిందితులు పేదవాళ్లు, తక్కువ కులాల నుంచి వచ్చిన వారున్నారు. వారు పారిపోవడానికి ప్రయత్నించారని చెప్తూ రాష్ట్ర ప్రభుత్వం ఎన్​కౌంటర్ చేసింది. జూబ్లీహిల్స్​లో మైనర్​పై జరిగిన అత్యాచార ఘటనలో రాష్ట్ర హోంమంత్రి మనవడు, వివిధ పార్టీల ప్రజాప్రతినిధుల, రాజకీయ నాయకులు పిల్లలున్నారని, అందుకు సాక్షాలున్నాయని మీడియా రాస్తున్నా పోలీసులు పట్టించుకోవడంలేదని ఆరోపించారు. పైగా నిర్దోషులంటూ పోలీసులు క్లీన్ చిట్ ఇస్తున్నారని విమర్శించారు. యాదగిరిగుట్ట గుడి నిర్మాణంలో అక్రమాలు, అవినీతి చోటు చేసుకుందని తమ్మినేని ఆరోపించారు.