
హైదరాబాద్, వెలుగు: నాంపల్లి కెమికల్ గోడౌన్ అగ్ని ప్రమాదంపై సమగ్ర విచారణ జరిపించాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ ప్రమాద ఘటనలో తొమ్మిది మంది కార్మికులు మరణించడం తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందని చెప్పారు. దుర్ఘటనలో మృతిచెందిన వారికి సంతాపాన్ని, వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. మృతుల కుటుంబాలను ప్రభుత్వం అన్ని రకాలుగా ఆదుకోవాలని, ఎక్స్ గ్రేషియాగా రూ.20 లక్షలు అందించాలని పేర్కొన్నారు.
గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని కోరారు. హైదరాబాద్లో వరుసగా ప్రమాదాలు జరుగుతున్నా.. ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ చేతులు దులుపుకుంటుందని విమర్శించారు. ప్రజలు నివసించే ప్రాంతాల్లో కెమికల్ గోడౌన్లను ఉంచకుండా చర్యలు తీసుకోవాలన్నారు. గో డౌన్లను శివారు ప్రాంతాలకు తరలించి ప్రమాదాలను అరికట్టాలని సూచించారు.