రిజిస్ట్రేషన్ రద్దుకు రూ.లక్ష డిమాండ్ చేసిన తాండూర్ సబ్ రిజిస్ట్రార్

రిజిస్ట్రేషన్ రద్దుకు రూ.లక్ష డిమాండ్ చేసిన తాండూర్ సబ్ రిజిస్ట్రార్

రూ.50వేలు తీసుకుంటూ పట్టుబడ్డ వైనం

వికారాబాద్, వెలుగు: భూమి రిజిస్ట్రేషన్ రద్దు కోసం ఓ రిజిస్ట్రార్ రూ.లక్ష డిమాండ్ చేయగా.. రూ.50వేల లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కాడు. వివరాల్లోకి వెళితే.. వికారాబాద్ జిల్లా యాలాల మండలం దౌల్తాబాద్ కు చెందిన హీర్యా నాయక్.. మూడేండ్ల కింద తన భూమిని తాండూర్ టౌన్​కు చెందిన ఈర్షద్ వద్ద కుదవపెట్టి రూ.5లక్షలు అప్పుగా తీసుకున్నాడు. ఇటీవల హీర్యా నాయక్ సదరు అప్పును ఈర్షద్​కు చెల్లించాడు. 

అయితే ఆ భూమి ఈర్షద్ పేరు మీదనే ఉండడంతో దాని రిజిస్ట్రేషన్ రద్దు కోసం సబ్ రిజిస్ట్రార్ వద్దకు వెళ్లాడు. రద్దు చేయాలంటే రూ.లక్ష చెల్లించాలని ఈర్షద్​ను సబ్​రిజిస్ట్రార్  జమిరోద్దీన్  డిమాండ్ చేశాడు. తన అనుచరుడైన జహిరోద్దీన్ కు ఈ మొత్తాన్ని ఇవ్వాలని కోరాడు. దీంతో ఆయన ఏసీబీని ఆశ్రయించాడు. ప్లాన్ ప్రకారం రూ.50వేల లంచం తీసుకుంటూ సబ్ రిజిస్ట్రార్ అనుచరుడు జహిరోద్దీన్ ఏసీబీకి చిక్కాడు. ఇద్దరినీ ఏసీబీ ఆఫీసర్లు కస్టడీలోకి తీసుకున్నారు.