తంగేడు లేదమ్మ ఉయ్యాలో..బతుకమ్మలన్నీ బంతిపూలతోనే

తంగేడు లేదమ్మ ఉయ్యాలో..బతుకమ్మలన్నీ బంతిపూలతోనే
  • బీళ్లన్నీ సాగు భూములు, వెంచర్లుగా మారడంతో తంగేడు, గునుగు పూలు కనుమరుగు   
  • గ్రానైట్ క్వారీలు, క్రషర్లతో గుట్టలపైనా కనిపించని పూల మొక్కలు 
  • శాత్రానికి రెండు, మూడు తంగేడు రెమ్మలతోనే సరి 
  • సీతజడ, బీర, కట్ల పువ్వులూ తక్కువే
  • పసుపు, ఆరెంజ్ కలర్ బంతి పూల వరుసతో బతుకమ్మలు పేరుస్తున్న మహిళలు

కరీంనగర్, వెలుగు: బతుకమ్మ అంటే ఒకప్పుడు తంగేడు, గునుగుపూల కూర్పే గుర్తొచ్చేది. కానీ ఇప్పుడు చేలల్లో, చెలకల్లో, గుట్టల్లో తంగేడు, గునుగు పూలు కరువై.. ఏ ఆడబిడ్డ చేతిలో చూసినా బంతిపూలు, కాగితపు పూల బతుకమ్మలే దర్శనమిస్తున్నాయి.  మహిళలు ఏదో శాత్రానికి రెండు, మూడు తంగేడు రెమ్మలు బతుకమ్మలో పేర్చి ఆ లోటును తీర్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. కొందరికి అవి కూడా దొరకడం లేదు. ఒకప్పుడు చెలకలు, గుట్టలవైపుపోతే ఎక్కడ చూసినా తంగేడు, గునుగుపూలే కనిపించేవి. బతుకమ్మ పండుగ వచ్చిందంటే చేతిలో సంచి పట్టుకొని తంగేడు, గునుగుపూలు తీసుకొచ్చేవారు.  కానీ దశాబ్దన్నర కాలంగా లక్షలాది ఎకరాల బీడు భూములు సాగు భూములుగా మారడం, గ్రానైట్ బండల కోసం గుట్టలను కొల్లగొడుతుండడం, సాగుభూములను చదును చేసి రియల్ ఎస్టేట్ వెంచర్లుగా మారుస్తుండడంతో తంగేడు, గునుగు మొక్కలు ఎక్కడ చూద్దామన్న కనిపించడం లేదు. తెలంగాణ అస్తిత్వంలో  తనకంటూ ఓ ప్రత్యేక స్థానం కలిగి.. రాష్ట్ర పువ్వుగా అధికారికంగా గుర్తింపు పొందిన తంగేడు పూలు కనుమరుగైపోతున్నాయి. దీంతో బతుకమ్మ పేర్చేందుకు ఎక్కడైనా తంగేడు పూలు దొరికితే బంగారంలా కళ్లకద్దుకుని అపురూపంగా తీసుకొచ్చుకునే పరిస్థితి వచ్చింది. 

తంగెళ్లు కనుమరుగు.. 

తెలంగాణలో ఎంతటి వర్షాభావ పరిస్థితులు ఎదురైనా, తక్కువ నీటితో జీవించే మొక్క తంగేడు. బీడుభూముల్లో ఎక్కువగా తంగేడు మొక్కలే కనిపించేవి. గతంలో పశుసంపద ఎక్కువగా ఉన్నప్పుడు రైతులు వాటి మేత కోసం కొంత భూమిని బీడుగా వదిలేవారు.అలాగే మక్క, జొన్న, కంది, పల్లి, పెసరలాంటి పంటలు ఎక్కువగా సాగుచేసేవాళ్లు. వర్షాకాలం ఈ చేన్లలో, చెల్కల్లో గునుగు విరివిగా పెరిగేది. పెత్తరమాస నాటికి చెల్కలన్నీ తెల్లటి గునుగుపూలతో అలరించేవి. కానీ కొన్నేళ్లుగా సాగునీటి లభ్యత పెరిగాక.. అన్నదాతలు ఆరుతడి పంటలు తగ్గించారు. వరి, పత్తిలాంటి పంటలను లక్షలాది ఎకరాల్లో సాగుచేస్తున్నారు. రాష్ట్రంలో ఈ ఏడాది 55 లక్షల ఎకరాల్లో వరి సాగు కాగా.. 60 లక్షల ఎకరాల్లో పత్తి సాగయినట్లు అంచనా. కొన్నేండ్లుగా ఇదే ట్రెండ్ కొనసాగుతున్నది. దీంతో ఆరుతడి పంటలు, బీళ్లతోపాటు తంగెళ్లు, గునుగు పూలు  కనుమరుగైపోయాయి. పత్తి, కూరగాయల తోటల్లో  విచ్చలవిడిగా పురుగుమందులు, కూలీల కొరతతో కలుపు నివారణ మందులు పిచికారీ చేస్తుండడంతో గునుగు, సీత జడ, ఇతర  గడ్డి జాతిపూలు కూడా అంతరించిపోతున్నాయి. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలాంటి ప్రాంతాల్లో గుట్టలన్నీ గ్రానైట్ క్వారీలు, క్రషర్లుగా మారడంతో ఆ ప్రాంతంలో ఏ మొక్కా మొలిచే పరిస్థితి లేకుండాపోయింది. దీంతోపాటు రాష్ట్రంలో ప్రధాన నగరాలు, పట్టణాలకు సమీపంలో 20, 30 కిలోమీటర్ల దూరం వరకు వందలాది ఎకరాల్లో వెలుస్తున్న రియల్ ఎస్టేట్ వెంచర్లతోనూ తంగేడు పూలు కానరాకుండా పోతున్నాయి. గడిచిన పదేండ్లలో సుమారు 18 లక్షల ఎకరాల భూములు రియల్ ఎస్టేట్ వెంచర్లుగా మారాయని అంచనా.  వెంచర్ల ఏర్పాటు కోసం వ్యవసాయ భూముల్లో ట్రాక్టర్ బ్లేడ్ వేసి చదును చేయడం, ఈ భూముల్లోని తంగెళ్లను వేళ్లతో సహా పెకిలించి వేయడంతో.. మళ్లీ మొలవడం లేదు.   

మార్కెట్‌‌లో బతుకమ్మ  పూలకు ఫుల్​ డిమాండ్​

తంగేడు, గునుగు పూల కొరత తీవ్రంగా ఉండడంతో మార్కెట్‌‌లో ఈ పూలకు డిమాండ్‌‌ పెరిగింది. అసలు తంగేడు బదులు.. అడవి తంగేడు పూల( ఈ చెట్టు ఆకు, పువ్వు పెద్ద సైజులో ఉంటాయి) ను అమ్ముతున్నారు. బతుకమ్మలో ఒక వరుసకు కూడా సరిపోని కట్ట తంగేడు, గునుగు పూలను రూ.100, రూ.200 కు విక్రయిస్తున్నారు. హైదరాబాద్ లాంటి ప్రాంతాల్లో అంతకంటే ఎక్కువ రేటుకే అమ్ముతున్నారు. వీటితోపాటు సీతజడ (పట్టుకుచ్చులు) పూలు, కట్ల పూలు, టేకు పూలు, బీర పూలు, గులాబీలు, చామంతులు, కనకంబరాలు, గోరెంకపూలు, గన్నేరుపూలు అరకొరకగానే దొరుకుతున్నాయి. తోటల్లో సాగు చేసి పెంచడం వల్ల బంతిపూలు మాత్రమే విరివిగా లభిస్తున్నాయి. వీటిని కిలోకు రూ.50 నుంచి రూ.100 వరకు అమ్ముతున్నారు. క్వాంటిటీ కూడా ఎక్కువగా రావడంతో అందరి బతుకమ్మల్లో ఎల్లో, ఆరెంజ్ కలర్ బంతి పూలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. పైన చామంతి, సీతజడ, గునుగు పూలు పెట్టి పేరుస్తున్నారు.  మరికొన్నేండ్లు పోతే తంగేడు పూలు లేని బతుకమ్మలు చేసుకోవాల్సి వస్తుందేమోనని  మహిళలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

కొందామన్న దొర్కుతలేవు..

నా చిన్నప్పుడు మా ఇంట్లో మొత్తం తంగేడు, గునుగు పూలతోనే బతుకమ్మ పేర్చి, ఆడుతుండె. మా నాన్న, తమ్ముడు చెలకలు, గుట్టలకు పోయి పువ్వులు తీసుకొచ్చేటోళ్లు. ఇప్పుడు అసలు చెలకల వైపు పోయినా ఆ పూలు దొరకట్లేదు. కరీంనగర్‌‌‌‌లో ఎక్కడైనా అమ్మితే కొందామన్నా తంగేడు, గునుగు పూలు కనిపించడం లేదు. దీంతో బంతి పూలు, డెకరేషన్ పూలు, గులాబీ పూలతో బతుకమ్మ పేరుస్తున్నం. 
- బి.కృష్ణవేణి, కరీంనగర్