
గువాహటి: ఇండియా యంగ్ షట్లర్లు తన్వి శర్మ, ఉన్నతి హుడా.. బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ జూనియర్ చాంపియన్‌షిప్‌లో బోణీ చేశారు. మంగళవారం జరిగిన గర్ల్స్ సింగిల్స్ తొలి రౌండ్‌లో తన్వి 15–2, 15–1తో విక్టోరియా కలెట్కా (పోలెండ్)పై గెలిచింది. ఆరంభం నుంచే బలమైన స్మాష్‌లు, క్రాస్ కోర్టు విన్నర్లతో చెలరేగిన తన్వి 11 నిమిషాల్లోనే ప్రత్యర్థికి చెక్ పెట్టింది.
మరో మ్యాచ్‌లో ఎనిమిదో సీడ్ ఉన్నతి 15–8, 15–9తో లియు హోయ్ అన్నా (హాంకాంగ్)పై నెగ్గగా, రక్షిత శ్రీ 15–5, 15–9తో లక్కి యాంగ్ (కెనడా)ను ఓడించింది. బాయ్స్ సింగిల్స్‌లో రౌనక్ చౌహాన్ 15–3, 15–6తో తిసాత్ రుపతుంగ (శ్రీలంక)పై, సూర్యాక్ష్ రావత్ 15–5, 15–8తో యిగిట్కాన్ ఎరోల్ (టర్కీ)పై, లాల్తాజులా హమర్ 15–11, 15–5తో రైలాన్ టాన్ (అమెరికా)పై, జ్ఞాన దత్తు 15–10, 15–13తో జోక్విమ్ మెడోన్కా (బ్రెజిల్)పై గెలిచి తదుపరి రౌండ్‌లోకి ప్రవేశించారు.
గర్ల్స్ సింగిల్స్ రెండో రౌండ్‌లో వెన్నెల 6–15, 5–15తో ఐదోసీడ్ టోన్రగ్ సాహెంగ్ (థాయ్‌లాండ్) చేతిలో ఓడింది. మిక్స్‌డ్ డబుల్స్‌లో భవ్యా చాబ్రా–విశాఖ టొప్పో 15–4, 13–5, 15–5తో గియాన్ సోఫియాన్–సల్సబిలా ఔటియాపై, లాల్‌రామ్‌సంగా–తారిణి సూరి 15–12, 15–5తో ప్రత్యర్థులపై విజయం సాధించారు.