
- నల్లా నీళ్లు వారానికి ఒకట్రెండుసార్లే!
- గ్రేటర్ కాలనీల్లో లో ప్రెషర్ సమస్య
- పట్టించుకోని వాటర్ బోర్డు ఆఫీసర్లు
- వానాకాలంలోనూ తప్పని మంచినీటి తిప్పలు
హైదరాబాద్, వెలుగు: సిటీలోని అనేక ప్రాంతాల్లో నల్లా నీళ్లు సరిగ్గా సరఫరా కావడం లేదు. వారానికి ఒకటి, రెండు సార్లు మాత్రమే వస్తున్నాయి. లోప్రెషర్సమస్య తీవ్రంగా ఉంది. నీళ్లు వచ్చే టైంకు మోటార్లు బిగించకపోతే సరిపడా రాని పరిస్థితి నెలకొంది. ఫలితంగా కరెంటు బిల్లులు పెరుగుతున్నాయని జనం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం వాటర్‌బోర్డు పరిధిలో 540 ఎంజీడీల నీటి డిమాండ్‌ఉందని, అందుకు అనుగుణంగా సరఫరా చేస్తున్నామని అధికారులు చెబుతున్నప్పటికీ క్షేత్రస్థాయిలో పరిస్థితి మరోలా ఉంది. రోజు విడిచి రోజు 20వేల లీటర్లు ఉచితంగా అందిస్తున్నామంటున్నా చాలా ప్రాంతాల్లో ఆ మేరకు కూడా నీళ్లు అందడం లేదు. కొన్ని ప్రాంతాల్లో వారానికోసారి నల్లా వస్తోంది. సరిపడా నీళ్లు రావడం లేదని బాధితులు తరచూ వాటర్‌బోర్డుకు ఫిర్యాదు చేస్తూనే ఉన్నారు. నల్లా నీటి సరఫరాలో అంతరాయం లేకుండా చూడాలని ఫలక్ నుమాకు చెందిన ఓ వ్యక్తి ఇటీవల మంత్రి కేటీఆర్ తోపాటు వాటర్‌బోర్డు ఎండీ దానకిశోర్ కు లెటర్ రాశాడు. డివిజన్ల స్థాయిలో ఇలాగే అనేక మంది నీటి సమస్యపై ఫిర్యాదులు చేస్తూన్నారు. అలాగే లోప్రెషర్లేకుండా సరఫరా అవుతున్న కొన్నిప్రాంతాల్లో కలుషిత సమస్య పెరిగిపోతోంది. దీనిపై రెండ్రోజుల్లో వాటర్‌బోర్డుకు వందకిపైగా ఫిర్యాదులు వచ్చాయి.
పనులు చేయకుండానే టోకెన్క్లోజ్
వారానికి ఒకటి, రెండు సార్లు నల్లా వస్తుండడంతో మహిళలు పడరాని పాట్లు పడుతున్నారు. ఎప్పుడొస్తుందా అని ఎదురు చూస్తున్నారు. సూరారంలోని రాజీవ్ గృహకల్పలో వారానికోసారి నల్లా వస్తోంది. బండ్లగూడ జాగీర్ లోని సత్యా ఎన్‌క్లేవ్‌లో 4 నెలలుగా వాటర్ సప్లై జరగడం లేదని వాటర్‌బోర్డుకు ఫిర్యాదులు వస్తున్నాయి. అయితే పనులు చేయకుండానే సమస్య పరిష్కరించినట్లు టోకెన్ నంబర్ ను క్లోజ్ చేస్తున్నారని కాలనీ వాసులు అంటున్నారు. బోరబండ పద్మావతినగర్ లోనూ ఇదే సమస్య ఉంది. బంజారాహిల్స్ గౌరీశంకర్ కాలనీలో ఏ టైంకు నీళ్లు వస్తయో తెలియడం లేదు. 24గంటలూ నీటి కోసం ఎదురుచూడాల్సి వస్తోంది. బోడుప్పల్, కొండాపూర్, గచ్చిబౌలి, ప్రగతినగర్, నిజాంపేట, జగద్గిరిగుట్ట, మన్సూరాబాద్, మౌలాలి, మల్కాజిగిరి, బహదూర్ పురా, సీతాఫల్ మండి, అల్వాల్, మూసాపేట తదితర ప్రాంతాల్లో లోప్రెషర్సమస్యతో అరకొరగా నీళ్లు సరఫరా అవుతున్నాయి. సిటీలో ఫ్రీ వాటర్‌స్కీం ఉన్నప్పటికీ మోటార్లు పెడితేకానీ నీళ్లు రాని పరిస్థితి ఉంది. ఫలితంగా అధిక కరెంట్ బిల్లు వస్తోందని జనం వాపోతున్నారు. మోటార్లు పెట్టకపోతే వచ్చే నీళ్లు ఒక్కరోజుకు కూడా సరిపోవడం లేదని చెబుతున్నారు. ఎత్తులో ఉన్న కాలనీల్లో బూస్టర్లు ఏర్పాటు చేస్తే లో ప్రెషర్ సమస్య తీరుతుంది.
కలుషిత నీటిపై ఫిర్యాదులు..
కొన్నిరోజులుగా వందలాది కాలనీల్లో కలుషిత నీరు సరఫరా అవుతోంది. ఈస్ట్ ఆనంద్ బాగ్, మదీనాలోని మురాద్ నగర్, ఎల్లారెడ్డిగూడ, డబీర్ పురా, శాలిబండలోని నవగ్రహ టెంపుల్ లేన్, సుభాష్ నగర్, ఫతేనగర్ లోని ధీన్ దయాల్ నగర్, మల్కాజిగిరిలోని జ్యోతినగర్, గౌతమ్ నగర్, దయానంద్ నగర్, బోరబండలోని ఎన్బీఆర్ పురం, పద్మావతి నగర్, చింతల్ లోని సాయినగర్, రామాంతాపూర్, మౌలాలిలోని సాదుల్లానగర్, అల్వాల్, కుషాయిగూడ ఇలా అనేక ప్రాంతాల వాటర్‌బోర్డుకు ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. దీంతో ఉన్నతాధికారులు కిందిస్థాయి అధికారులపై ఫైర్ అవుతున్నారు. జనానికి సమాధానం చెప్పలేకపోతున్నామని, త్వరగా పనులు పూర్తి చేయాలని హెచ్చరిస్తున్నారు. కానీ ఆఫీసులను వదిలి ఫీల్డ్‌లోకి వచ్చిన దాఖలాలు మాత్రం లేవు.
ఎప్పుడొస్తయో తెల్వదు
మా ఏరియాలో నీళ్లు ఏ టైంకు వదులుతున్నారో తెలియడం లేదు. లోప్రెషర్సమస్య వేధిస్తోంది. నీళ్లు వదిలినప్పుడు సన్నగా వస్తున్నాయి. అది కూడా కొద్దిసేపు మాత్రమే. అస్సలు సరిపోవడం లేదు. ఉదయం పూట నల్లాలు వదిలితే ఎలాంటి ఇబ్బంది ఉండదు. డ్యూటీలకు వెళ్లాక నీళ్లు వదులుతున్నారు. వాటర్‌బోర్డు అధికారులు దృష్టి పెట్టాలి.
– వెంకటేశ్, గౌరీ శంకర్ కాలనీ, బంజారాహిల్స్
దృష్టికి తీసుకొస్తే చర్యలు తీస్కుంటం
సిటీలో తాగునీటి సరఫరా మంచిగానే జరుగుతుంది. ప్రస్తుతం 540 ఎంజీడీల డిమాండ్ ఉంది. అందుకు అనుగుణంగా నీటిని సరఫరా చేస్తున్నం. ఎక్కడైనా ఇబ్బందులు ఉన్నట్లు తమ దృష్టికి తీసుకొస్తే పరిశీలించి చర్యలు తీసుకుంటున్నం. సంబంధిత ఆఫీసర్లను అలర్ట్ చేస్తున్నం.
– రవికుమార్, వాటర్‌బోర్డు డైరెక్టర్