తారకరామ థియేటర్ రీ ఓపెన్

తారకరామ థియేటర్ రీ ఓపెన్

సినిమా టికెట్ రేట్లు అందరికీ అందుబాటులో ఉండటం ఇండస్ట్రీకి చాలా ఆరోగ్యకరమైనది. ఓటీటీ రూపంలో కాంపిటేషన్ వుంది కనుక అందరం కలసి థియేటర్స్‌‌కు మంచి సినిమాలని అందించాలి. ప్రేక్షకులు తప్పకుండా థియేటర్స్‌‌కి వస్తారు’ అన్నారు బాలకృష్ణ. హైదరాబాద్‌‌లోని కాచిగూడ క్రాస్ రోడ్స్‌‌లో ఉన్న తారకరామ థియేటర్‌‌‌‌ను ఆయన రీ ఓపెన్ చేశారు. నందమూరి కుటుంబానికి చెందిన ఈ థియేటర్‌‌‌‌ను ఏషియన్ సంస్థ కొత్త టెక్నాలజీతో రెనోవేట్ చేసింది. ఈనెల 16న విడుదలవుతోన్న ‘అవతార్‌‌‌‌’ చిత్రంతో తిరిగి స్క్రీనింగ్ స్టార్ట్ చేస్తున్నారు. ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ ‘ఈ థియేటర్ కి ఒక చరిత్ర వుంది. 1978లో ‘అక్బర్ సలీం అనార్కలి’తో దీన్ని ప్రారంభించారు. ‘డాన్’ సినిమా ఇక్కడ 525 రోజులు ఆడింది. మంగమ్మగారి మనవడు, ముద్దుల మావయ్య, ముద్దుల కృష్ణయ్య లాంటి నా సినిమాలు అద్భుతంగా ఆడాయి. 

అలాగే మా అబ్బాయికి మోక్షజ్ఞ తారకరామ తేజ అనే పేరు ఈ థియేటర్‌‌‌‌లోనే పెట్టారు. నాన్న గారితో నారాయణ్ కె దాస్ నారంగ్ గారికి సన్నిహిత సంబంధాలు ఉండేవి. వాళ్ళ అబ్బాయి సునీల్ నారంగ్ పర్యవేక్షణలో ఈ థియేటర్ నడపడం చాలా సంతోషంగా వుంది’ అన్నారు. సునీల్ నారంగ్ మాట్లాడుతూ ‘ఈ థియేటర్‌‌‌‌ను సరికొత్త టెక్నాలజీతో అద్భుతంగా మార్చాం. 600 సీటింగ్‌‌తో పూర్తి రెక్లైనర్ సీట్లు ఏర్పాటు చేశాం. రీజనబుల్‌‌ రేట్లు పెట్టాం. నందమూరి కుటుంబంతో మా అనుబంధం ఇలాగే కొనసాగాలని కోరుకుంటున్నా’ అన్నారు. ఈ కార్యక్రమంలో నందమూరి మోహన్ కృష్ణ, నిర్మాతల మండలి సెక్రెటరీ ప్రసన్న కుమార్, నిర్మాత శిరీష్, సదానంద్ గౌడ్, భరత్ నారంగ్, డైరెక్టర్ వైవీఎస్ చౌదరి తదితరులు పాల్గొన్నారు.