ముషీరాబాద్, వెలుగు : గ్రూప్ 2 పరీక్షలకు ప్రిపేరవుతున్న ఓ అమ్మాయి ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన సోమవారం సాయంత్రం హైదరాబాద్ లోని చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. ఘటనకు సంబంధించిన వివరాలను ఇన్ స్పెక్టర్ సంజయ్ కుమార్ మీడియాకు తెలిపారు. నారాయణపేట జిల్లా మరికల్ మండలం దత్తు నగర్ కు చెందిన విజయకుమార్, చంద్రకళకు నలుగురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. ఐదుగురు సంతానంలో రెండో కుమార్తె అయిన రత్నకుమారి (24) పోటీ పరీక్షల శిక్షణ కోసం హైదరాబాద్ నగరానికి వచ్చింది.
చిక్కడపల్లి వివేక్ నగర్ లోని తరంగిణి ఉమెన్స్ హాస్టల్ లో ఉంటూ నాగార్జున స్టడీ సర్కిల్ లో గ్రూప్ 2 పరీక్షల కోసం ప్రిపేర్ అవుతున్నది. గత ఏడాది రత్నకుమారి అనారోగ్య కారణాలతో శస్త్రచికిత్స చేయించుకుంది. హాస్టల్ లో తాను ఉంటున్న గదిలో కాకుండా మరో గదిలో ఎవరూలేని సమయంలో రత్నకుమారి చున్నీతో ఫ్యాన్ కు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. ఆమె ఆత్మహత్య చేసుకున్న ప్రదేశంలో ఎలాంటి లేఖ లభించలేదు.
దీంతో ఆత్మహత్యకు గల కారణాలు వెల్లడి కావాల్సి ఉంది. అనారోగ్య సమస్యలతోనే ఆమె ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఘటనా స్థలానికి క్లూస్ టీం చేరుకొని ఆధారాలు స్వీకరించింది. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం గాంధీ ఆసుపత్రికి తరలించారు. మృతురాలి తల్లిదండ్రులకు పోలీసులు సమాచారం అందించారు.