గ్రేటర్ లో స్పీడు తగ్గిన కారు

గ్రేటర్ లో స్పీడు తగ్గిన కారు

పార్టీ సభ్యత్వాల నమోదులో కారు స్పీడు తగ్గింది. టీఆర్​ఎస్ ​వర్కింగ్​ప్రెసిడెంట్​ కేటీఆర్​ మీటింగ్ ​పెట్టి గట్టిగా చెప్పినా సిటీ నేతలు స్పందించ లేదు. ఈ నెల 10 వరకు ఇచ్చిన గడువుకి సరైన స్పందన రానట్టు తెలుస్తోంది. ప్రతి సెగ్మెంట్​లో 50వేల మెంబర్​షిప్​ టార్గెట్​ను ఎవరూ రీచ్ ​కాలేదు. 24 నియోజకవర్గాల్లో 16 చోట్ల పార్టీ ఎమ్మెల్యేలు ఉన్నారు. చాలా చోట్ల 10వేల సభ్యత్వాలైనా కానట్టు తెలుస్తోంది.  

హైదరాబాద్, వెలుగుగ్రేటర్ లో సభ్యత్వాల విషయంలో ఇంత వీకా అని కేటీఆర్ అన్న మాటలను ఆ పార్టీ నేతలు దాదాపు నిజం చేశారు. సభ్యత్వాల విషయంలో స్వయంగా కేటీఆర్ నుంచి ఆదేశాలు వచ్చినా.. నేతల నుంచి ఆ స్థాయిలో స్పందన కరువైంది. ప్రతి నియోజకవర్గంలో 50 వేల సభ్యత్వాలు నమోదు చేయాలని పార్టీ అధినేత కేసీఆర్ లక్ష్యం పెట్టినప్పటికీ ఎవరూ లక్ష్య పెట్టలేదు. దీంతో నగరంలో మూడు నియోజకవర్గాలు మినహా ఏమీ టార్గెట్​ చేరుకోలేదు. లక్ష్యాన్ని పూర్తి చేసింది మేడ్చల్, జూబ్లీహిల్స్, మహేశ్వరం నియోజకవర్గాలు మాత్రమే. ఇక్కడ 50 వేలకు పైగా సభ్యత్వాలు నమోదయ్యాయి. ఈ నెల 10 నాటికి గడువు ఇస్తే అన్ని నియోజకవర్గాల్లో పార్టీ సభ్యత్వాల లక్ష్యాన్ని పూర్తి చేస్తామని మంత్రి తలసాని పేర్కొన్నారు. కానీ గడువు పూర్తైనప్పటికీ పదిరోజుల్లో ఒక్క నియోజకవర్గంలోనూ లక్ష్యం కోసం ఏమాత్రం కసరత్తు జరగలేదు. అన్ని నియోజకవర్గాల్లో సభ్యత్వాల నమోదు లక్ష్యానికి అమడ దూరంలో నిలిచిపోయారు గ్రేటర్ నేతలు.

గోషామహల్ లో కాస్త నయం

గ్రేటర్ లో శివారు నియోజకవర్గాలను మినహాయించి కోర్ సిటి లో నియోజకవర్గాల వారీగా పరిశీలిస్తే గోషామహల్ లో సభ్యత్వాలు కాస్త నయమని తెలుస్తోంది. ఇక్కడ బీజేపీ ఎమ్మెల్యే ఉన్నప్పటికీ టీఆర్ఎస్ దాదాపు 35 వేల సభ్యత్వాలు నమోదు చేయించినట్లు సమాచారం. ఇక పార్టీ ఎమ్మెల్యేలున్న చాలా నియోజకవర్గాల్లో 25 వేల సభ్యత్వాలు కూడా పూర్తి కాలేదు. గ్రేటర్ లో మొత్తం 24 నియోజకవర్గాలకు గానూ 16 మంది టీఆర్ఎస్ ఎమ్మెల్యేలే ఉన్నారు. వీరిలో ముగ్గురు మాత్రమే లక్ష్యాన్ని పూర్తి చేశారు. మంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని ఆయన నియోజకవర్గంలో దాదాపు 35 వేల సభ్యత్వాలు నమోదు చేయించినట్లు తెలుస్తోంది. ఇక మిగిలిన అన్ని నియోజకవర్గాల్లో సభ్యత్వాల నమోదు చాలా వీక్ గానే ఉంది.

కేటీఆర్ ఆదేశించినా పట్టించుకోని నేతలు

గ్రేటర్ లో సభ్యత్వాల నమోదు విషయంలో మొదటి నుంచీ కేటీఆర్ అసంతృప్తితోనే ఉన్నారు. ఈ నెల 1న గ్రేటర్ నేతలతో ప్రత్యేకంగా సమావేశం నిర్వహించారు. సభ్యత్వాల లక్ష్యాన్ని ఎందుకు చేరుకోలేకపోయారని ప్రశ్నించారు. పార్టీకి 14 మంది ఎమ్మెల్యేలు, 100 మంది కార్పొరేటర్లు ఉన్నప్పటికీ ఎందుకింత వీక్ గా ఉన్నారని ప్రశ్నించారు. నేతల మధ్య సమన్వయం లోపం ఉందని దాన్ని అధిగమించి అందరూ పార్టీ కోసం పని చేయాలని కోరారు. ఈ సందర్భంగా ఈ నెల 10 వరకూ గడవిస్తే లక్ష్యం పూర్తి చేస్తామని తలసాని చెప్పారు. ఆ తర్వాత పార్టీ నేతల్లో జోష్ నింపేందుకు ఆగస్టు 6 నుంచి నగరంలో పర్యటించాలని భావించారు. సికింద్రాబాద్ నియోజకవర్గంలో సభ్యత్వ నమోదు కార్యక్రమానికి హాజరు కావాల్సి ఉన్నప్పటికీ చివరి నిమిషంలో రద్దు చేసుకున్నారు. ఆ తర్వాత పార్టీ నేతలు కూడా సభ్యత్వ నమోదు విషయంలో ప్రత్యేక చొరవ చూపలేదు. దీంతో ఈ పదిరోజుల్లో అన్ని నియోజకవర్గాల్లోనూ మరో 5 నుంచి 10 వేలకు మించి సభ్యత్వాలు నమోదు కాలేదు. ఇక పాతబస్తీలో మరీ వెనుకబడి పోయారు. లక్ష్యంలో కనీసం సగమైనా సభ్యత్వాలు అవుతాయని భావించారు. కానీ చాలా నియోజకవర్గాల్లో 5 వేలకు మించి కాలేదు.

సమన్వయ లోపమే కారణమా?

సభ్యత్వాల నమోదు లక్ష్యం చేరకపోవటానికి పార్టీ నేతల మధ్య సమన్వయ లోపమే కారణమని అధిష్టానం భావిస్తోంది. కొంతమంది నేతలే పెత్తనం చెలాయిస్తున్నారన్న భావనలో సీనియర్ నేతలున్నారు. ఈ క్రమంలోనే వారు పార్టీ సభ్యత్వాల విషయంలో యాక్టివ్ గా పని చేయటం లేదని తెలుస్తోంది. ఐతే ఈ విషయాన్ని గ్రహించిన కేటీఆర్ మొన్నటి సమావేశంలో పరోక్షంగా అందరికీ వార్నింగ్ ఇచ్చారు. పార్టీ కోసం పని చేయాలని ప్రతి ఒక్కరికీ సూచించారు. అయినప్పటికీ గ్రేటర్ నేతలు కలిసి పని చేయటంలో విఫలమయ్యారు. దీనికి తోడు చాలా నియోజకవర్గాల్లో సభ్యత్వ రుసుము పార్టీ ప్రధాన కార్యాలయానికి చేరలేదనేది సమాచారం. క్రియాశీలక సభ్యత్వానికి 100, సాధారణ సభ్యత్వానికి 30 రూపాయలు వసూలు చేశారు. సభ్యత్వాల సొమ్ము పార్టీ కేంద్ర కార్యాలయానికి చేరాలి. కానీ ఆ సొమ్ము ఇప్పటికీ పార్టీకి చేరలేదని తెలుస్తోంది. దీనిపై కూడా కేటీఆర్ గుర్రుగా ఉన్నట్టు సమాచారం.