
- యూఎస్ సుప్రీంకోర్టుకు ట్రంప్ సర్కార్ వివరణ
- రష్యా నుంచి ఆయిల్ కొంటూ యుద్ధానికి ఇండియా పరోక్షంగా సహకరిస్తున్నది
- వద్దని చెప్పినా వినిపించుకోవడం లేదని అఫిడవిట్
- ఏడాది కింద అమెరికా డెడ్ కంట్రీ.. ఇప్పుడు రిచ్ అని వెల్లడి
వాషింగ్టన్: ఉక్రెయిన్లో శాంతి స్థాపన కోసమే ఇండియాపై టారిఫ్లు వేస్తున్నామని అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ బృందం ఆ దేశ సుప్రీంకోర్టుకు వివరణ ఇచ్చింది. టారిఫ్లు తగ్గిస్తే దేశం ఆర్థిక సంక్షోభంలోకి వెళ్తుందని తెలిపింది. ఆయా దేశాలపై సుంకాలు విధించడం కారణంగానే అమెరికా ఆర్థికంగా కొంత వరకు పుంజుకున్నదని పేర్కొన్నది. ఇండియాతో పాటు ప్రపంచంలో పలు దేశాలపై 1977 ఇంటర్నేషనల్ ఎమర్జెన్సీ ఎకనామిక్స్ పవర్స్ యాక్ట్ నిబంధనలకు మించి ఎక్కువ మొత్తంలో టారిఫ్‌లు విధించడాన్ని కింది కోర్టు తప్పుబట్టింది. దీంతో ఈ కేసు సుప్రీంకోర్టులో విచారణకు వచ్చింది. ట్రంప్ ప్రభుత్వం తరఫున సొలిసిటర్ జనరల్ జాన్ సౌర్ వాదించారు. రష్యా – ఉక్రెయిన్ యుద్ధానికి సంబంధించిన ‘నేషనల్ ఎమర్జెన్సీ’ ఆధారంగానే టారిఫ్‌లు వేశామన్నారు. యుద్ధాన్ని ఆపేందుకు ట్రంప్ యత్నిస్తున్నారని వివరించారు. ‘‘రష్యా నుంచి ఇండియా భారీగా ఆయిల్ కొంటున్నది. దానిని విక్రయించగా వచ్చిన డబ్బులను రష్యా.. ఉక్రెయిన్పై దాడికి ఉపయోగిస్తున్నది. రష్యా నుంచి చమురు కొనుగోలు చేయొద్దని ఇండియాకు చెప్పినా పట్టించుకోవడం లేదు. వాణిజ్య లోటును భర్తీ కోసం అన్ని దేశాల మాదిరిగానే ఇండియాపై 25 శాతం టారిఫ్ విధించాం. రష్యా చమురు కొనుగోలు చేస్తున్నందుకు అదనంగా మరో 25 శాతం విధించాం’’ అని జాన్ సౌర్ సుప్రీం కోర్టుకు వివరించారు.
దోచుకున్న డబ్బులు తిరిగి తెస్తున్నం
ఏడాది కింద అమెరికా ఓ డెడ్ కంట్రీ అని సొలిసిటర్ జనరల్ జాన్ సౌర్ సుప్రీం కోర్టుకు తెలిపారు. అమెరికాను చాలా దేశాలు టారిఫ్‌ల పేరుతో దోచుకున్నాయని వివరించారు. ‘‘టారిఫ్‌ల విషయంలో ఏమాత్రం వెనక్కి తగ్గినా.. ఆర్థికంగా అమెరికాకు మరింత నష్టం వాటిల్లే ప్రమాదం ఉంది’’అని తెలిపారు. ఈ అంశంపై వాదనలు విన్న సుప్రీంకోర్టు తీర్పును వాయిదా వేసింది. కాగా, టారిఫ్ లు విధించే అధికారం ప్రెసిడెంట్ కు ఉందని, ఈ కేసు విచారణ ఆలస్యం చేయొద్దని సుప్రీంకోర్టును ట్రంప్ సర్కారు కోరింది. ఈ వ్యవహారంపై శుక్రవారం తుది తీర్పు వెలువడే అవకాశాలున్నాయి.