టీఆర్ఎస్పై ఎన్నికల సంఘానికి తరుణ్ చుగ్ ఫిర్యాదు

టీఆర్ఎస్పై ఎన్నికల సంఘానికి తరుణ్ చుగ్ ఫిర్యాదు

ఢిల్లీ : టీఆర్ఎస్ ప్రభుత్వంపై బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ తరుణ్ చుగ్ కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. అధికార పార్టీ నేతలు బీజేపీ నేతల ఫోన్లను ట్యాప్ చేస్తున్నారని ఆరోపించారు. మునుగోడు ఎన్నికల్లో ఓటర్లను ప్రభావితం చేసేందుకు ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని అందులో ప్రస్తావించారు. ఎలాంటి ఆధారాలు లేకపోయినా నగదు లావాదేవీలకు సంబంధించి అక్రమ ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. బీజేపీపై ఆరోపణలు చేస్తున్న టీఆర్ఎస్ స్వయంగా గూగుల్ పే, ఫోన్ పే ద్వారా మునుగోడు ఓటర్లకు డబ్బు పంపుతోందని చుగ్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. 

రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగ సంఘాల నేతలు టీఆర్ఎస్ కోసం ప్రచారం చేస్తున్నాయని తరుణ్ చుగ్ ఆరోపించారు. టీఎన్జీఓ, ఆర్టీసీ ఉద్యోగ సంఘాల నేతలు చేస్తున్న వ్యాఖ్యలను ఆయన ప్రస్తావించారు. టీఎన్జీఓ నేతలైన మనిల రాజేందర్, శ్రవణ్ కుమార్ తో పాటు ఆర్టీసీ ఎంప్లాయిస్ యూనియన్ సెక్రటరీ థామస్ టీఆర్ఎస్కు ఓటేసేలా మునుగోడులోని ప్రభుత్వ ఉద్యోగులపై ఒత్తిడి తెస్తున్నారని ఆరోపించారు. ఇలాంటి చర్యలకు పాల్పడుతున్న టీఆర్ఎస్ నేతలపై చర్యలు తీసుకోవాలని చుగ్ ఎన్నికల సంఘాన్ని కోరారు.