మోడీ నాయకత్వంలోనే బంగారు తెలంగాణ

మోడీ నాయకత్వంలోనే బంగారు తెలంగాణ
  • కేసీఆర్ ఇక ఇంటికే
  • సాగనంపేందుకు జనం సిద్ధం: తరుణ్ చుగ్
  • ప్రధాని మోడీ నాయకత్వంలోనే బంగారు తెలంగాణ సాధ్యమని కామెంట్
  • బీజేపీ సర్కారొస్తే ఒక్కో నియోజకవర్గానికి లక్ష ఇండ్లు: అర్వింద్
  • జగిత్యాల జిల్లా కోరుట్లలో ‘ఢిల్లీ మనదే ‑ గల్లీ మనదే’ సభ
  • బీజేపీలో చేరిన సురభి నవీన్​

జగిత్యాల / కోరుట్ల, వెలుగు:  రాష్ట్రంలో కేసీఆర్ అవినీతి, కుటుంబపాలన నుంచి ప్రజలు విముక్తి కోరుకుంటున్నారని, త్వరలోనే ఆయనను ఇంటికి సాగనంపేందుకు సిద్ధమయ్యారని బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌‌చార్జ్‌‌ తరుణ్ చుగ్ అన్నారు. జగిత్యాల జిల్లా కోరుట్లలో ‘ఢిల్లీ మనదే – గల్లీ మనదే’ అన్న నినాదంతో గురువారం నిర్వహించిన బహిరంగ సభకు ఆయన హాజరయ్యారు. బీజేపీ సీనియర్ నేత సురభి భూమ్ రావు కొడుకు సురభి నవీన్ కుమార్.. బీజేపీలో చేరగా ఆయనకు తరుణ్ చుగ్ పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. నిరుద్యోగులకు ఉపాధి కల్పిస్తామని హామీ ఇచ్చిన కేసీఆర్​ యువతను మోసగించారని, ఆయన కుటుంబంలోని వారందరికీ పదవులు ఇచ్చుకున్నారని తరుణ్​చుగ్​ విమర్శించారు. రాష్ట్రంలో ప్రజలు డబుల్ ఇంజన్ పాలన కోరుకుంటున్నారని చెప్పారు. నరేంద్ర మోడీ నాయకత్వంలోనే బంగారు తెలంగాణ సాధ్యమవుతుందన్నారు.

డబుల్ ఇంజన్ సర్కారుతోనే అభివృద్ధి: అర్వింద్

తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో బీజేపీ జెండా ఎగరడం ఖాయమని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ అన్నారు. రాష్ట్రంలో సీఎం.. కేసీఆరా, కేటీఆరా అని ప్రజలు పరేషాన్ అవుతున్నారని, కోరుట్లలోనూ అదే పరిస్థితి ఉందన్నారు. ఇక్కడ ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యా సాగర్ రావు కొడుకు సంజయ్ పెత్తనం చేయడంపై ప్రజలు ఆగ్రహంతో ఉన్నారన్నారు. టీఆర్ఎస్‌‌లా బీజేపీలో కుటుంబ పాలన ఉండదన్నారు. కేంద్రంలోనూ, రాష్ట్రంలోనూ బీజేపీ సర్కారు వస్తేనే తెలంగాణ అన్ని విధాలా అభివృద్ధి చెందుతుందని చెప్పారు. ఇటీవల కురిసిన భారీ వర్షాల వల్ల ప్రజలు నిరాశ్రయులయ్యారని, వరదల్లో ప్రజలు చిక్కుకుంటే కనీసం రివ్యూ చేయకుండా కేసీఆర్ ఫామ్ హౌస్‌‌కి పరిమితమయ్యారని విమర్శించారు.

డబుల్ ఇంజన్ సర్కారు వస్తే ఒక్కో నియోజకవర్గానికి లక్ష ఇండ్లు కట్టిస్తామని హామీ ఇచ్చారు. రూ.5 వేల కోట్లతో ఎన్ఆర్ఐ సెల్ ఏర్పాటు చేసి గల్ఫ్ కార్మికులకు అండగా నిలుస్తామన్నారు. కోరుట్ల ప్రాంతం నుంచి పద్మశాలీలు ముంబైలో పనుల కోసం పెద్ద సంఖ్యలో వెళ్తుంటారని, జగిత్యాల నుంచి రోజూ ముంబైకి రైలు నడిపించేలా చూడాలని ఆయన తరుణ్ చుగ్‌‌ను కోరారు. బీజేపీ లీడర్లు సురభి భూమ్ రావు, గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి, సాంబార్ ప్రభాకర్, పూదరి అరుణ, తుల ఉమ, పైడిపల్లి సత్యనారాయణ రావు, చంద్రశేఖర్ రావు, జె.ఎన్. వెంకట్ తదితరులు పాల్గొన్నారు.