కేసీఆర్ తీరును ఖండించిన తరుణ్ చుగ్

కేసీఆర్ తీరును ఖండించిన తరుణ్ చుగ్
  • జీ20పై ఆల్ పార్టీ మీటింగ్​కు సీఎం రాకపోవడంపై తరుణ్ చుగ్
  • ప్రధానిపై ద్వేషం.. దేశంపై ద్వేషంగా మారుతున్నదని ఫైర్ 

హైదరాబాద్, వెలుగు: సీఎం కేసీఆర్​కు ప్రధాని నరేంద్ర మోడీపై ఉన్న ద్వేషం కాస్తా.. దేశంపై ద్వేషంగా మారుతోందని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, పార్టీ రాష్ట్ర ఇన్​చార్జ్ తరుణ్ చుగ్ మండిపడ్డారు. జీ20 సదస్సుకు సంబంధించి సలహాలు, సూచనలను తీసుకునేందుకు ప్రధాని ఏర్పాటు చేసిన సీఎంలు, అఖిలపక్ష సమావేశానికి కేసీఆర్ డుమ్మా కొట్టి రాష్ట్ర ప్రజలను అవమానించారని ఆయన అన్నారు. కేసీఆర్ తీరును ఖండిస్తూ ఆయన మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. కేసీఆర్ కు రాజ్యాంగం, దేశంపై గౌరవం లేదన్నారు. జీ20 అధ్యక్ష బాధ్యతలను ఇండియా చేపట్టడంపై ప్రజలంతా సంతోషం వ్యక్తం చేస్తుంటే.. మోడీ ప్రతిష్ట పెరుగుతోందని కేసీఆర్ అక్కసు వెళ్లగక్కుతున్నారని విమర్శించారు. అందుకే అఖిలపక్ష సమావేశానికి డుమ్మా కొట్టారని అన్నారు. సిరిసిల్లకు చెందిన నేతన్న హరిప్రసాద్​ నేసిన జీ20 లోగోతో కూడిన వస్త్రం గురించి ప్రధాని నరేంద్ర మోడీ మన్ కీ బాత్​లో ప్రస్తావించిన విషయాన్ని సైతం ఆయన గుర్తు చేశారు.  

దేశాన్ని అవమానించిన్రు 

కేసీఆర్ ఏనాడూ ప్రతిపక్షాలను సమావేశాలకు పిలువలేదని, కనీసం సొంత మంత్రులనూ కలవరని తరుణ్ చుగ్ విమర్శించారు. ఇది ఆయన పెత్తందారీతనానికి నిదర్శనమని మండిపడ్డారు. ప్రజాస్వామ్యంలో నియంతృత్వానికి చోటు లేదన్నారు. రాజకీయ చైతన్యవంతులైన తెలంగాణ ప్రజలు దీనిని ఏమాత్రం సహించబోరని పేర్కొన్నారు. రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న ప్రధాని.. రాష్ట్రానికి వచ్చినప్పుడు కనీసం స్వాగతం పలకడానికి కూడా వెళ్లలేదన్నారు. బాలాకోట్ సర్జికల్ స్ట్రైక్స్​కు రుజువులు చూపించాలని అన్నారని, అరుణాచల్ ప్రదేశ్​లో భారత్​ను చైనా సైన్యం దంచి కొడుతోందంటూ సైన్యాన్ని అవమానించారని గుర్తు చేశారు. బంగ్లాదేశ్, శ్రీలంక కన్నా దేశ ఆర్థిక వ్యవస్థ అధ్వాన్నంగా ఉందంటూ దేశాన్ని అవమానించారన్నారు.