
టీఎస్పీఎస్సీ లీకుల్లో సీఎం కేసీఆర్ హస్తం ఉందని బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ తరుణ్ ఛుగ్ ఆరోపించారు. 30 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్ తో కేసీఆర్ ఆడుకుంటున్నారని మండిపడ్డారు. తెలంగాణ మంత్రి వర్గం ఆలీబాబా 40 దొంగలుగా తయారైందని మండిపడ్డారు. తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం అప్రజాస్వామికంగా వ్యవహరిస్తోందని అన్నారు. రాష్ట్రంలో కేసీఆర్ రాజ్యాంగం నడుస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ తప్పులు కప్పిపుచ్చుకోవడానికి కేసీఆర్ డైవర్ట్ రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణను కేసీఆర్ భ్రష్టు పట్టిస్తున్నారని విమర్శించారు. రాష్ట్రంలో లిక్కర్ మాఫియా, లీకేజీ మాఫియా నడుస్తోందన్నారు. రాష్ట్ర ప్రభుత్వంపై ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని..ప్రజా సునామీలో బీఆర్ఎస్ ప్రభుత్వం కొట్టుకుపోవడం ఖాయన్నారు.
బండి సంజయ్ వారియర్..
కరీంనగర్ లో బండి సంజయ్ అత్తగారు వనజ చిత్రపటానికి పూలు సమర్పించి తరుణ్ ఛుగ్ నివాళులు అర్పించారు. బండి సంజయ్ కుటుంబ సభ్యులను పరామర్శించారు. అనంతరం బండి సంజయ్ తల్లి ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ సందర్భంగా మీ కొడుకు వారియర్..మీరు బాధపడాల్సిన పని లేదు...అంటూ బండి సంజయ్ తల్లిని పరామర్శించారు.
ఎలా అరెస్ట్ చేస్తరు
ఓ ఎంపీని వారెంట్ లేకుండా ఎలా అరెస్ట్ చేస్తారని తరుణ్ చుగ్ ప్రశ్నించారు. అర్థరాత్రి బండి సంజయ్ ను అక్రమంగా అరెస్ట్ చేశారని మండిపడ్డారు. బండి సంజయ్ ఫోన్ ను పోలీసులే దొంగిలించారని ఆరోపించారు. ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తే సహించేది లేదని హెచ్చరించారు. బీజేపీ సత్యం కోసం, ధర్మం కోసం పోరాటం చేస్తుందన్నారు. విద్యార్థి, నిరుద్యోగుల తరపున బీజేపీ పోరాడుతుందన్నారు.