కేసీఆర్ కు కౌంట్ డౌన్ మొదలైంది

కేసీఆర్ కు కౌంట్ డౌన్ మొదలైంది

బీజేపీ రాష్ర్ట అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్రను అడ్డుకునేందుకు సీఎం కేసీఆర్ కుట్రలు చేస్తున్నారంటూ రాష్ర్ట వ్యవహారాల ఇన్ చార్జ్ తరుణ్ చుగ్ మండిపడ్డారు. రాష్ర్టంలో బీజేపీ చేపడుతున్న సభలు, సమావేశాలను అడ్డుకోవాలని టీఆర్ఎస్ సర్కారు కుట్రలు చేస్తోందని ఆరోపించారు. అధికారం చేజారిపోతుందన్న ఆందోళనలో కేసీఆర్ ఉన్నారని, అందుకే ప్రజా సంగ్రామ యాత్రపై టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలతో దాడులు చేయిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు వ్యవహరిస్తున్న తీరు సరిగ్గా లేదని, శాంతిభద్రతలను కాపాడాల్సిన బాధ్యత పోలీసులపైనే ఉందన్నారు. తెలంగాణలో సీఎం కేసీఆర్ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని, ఆయనకు అంబేడ్కర్ రాసిన రాజ్యాంగంపై కూడా విశ్వాసం లేదని పేర్కొన్నారు. 

మునుగోడు ఉప ఎన్నికలో బీజేపీదే గెలుపు

ఈనెల 21వ తేదీన మునుగోడులో నిర్వహించే బహిరంగ సభకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా హాజరుకానున్నారని తరుణ్ చుగ్ చెప్పారు. ఇతర పార్టీల నుంచి పెద్ద సంఖ్యలో నాయకులు అమిత్ షా సమక్షంలో బీజేపీలో చేరుతారని వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం అన్ని వర్గాలకు అన్యాయం చేస్తోందని, కేసీఆర్ పరిపాలనలో జరుగుతున్న అన్యాయాలపై అమిత్ షా మాట్లాడుతారని చెప్పారు. దుబ్బాక, హుజురాబాద్ నియోజకవర్గాల్లో గెలిచినట్లుగానే మునుగోడులోనూ బీజేపీ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. 

కేసీఆర్ సాయంత్రం స్పీచ్ లపై స్పందించను 
‘కేసీఆర్ సాయంత్రం పూట మాట్లాడే మాటలకు నేను సమాధానం ఇవ్వను. సాయంత్రం అయితే ఏం జరుగుతుందో అందరికీ తెలుసు’ అని తరుణ్ చుగ్ అన్నారు. జనగామ జిల్లా దేవరుప్పుల మండలంలో సాగిన బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్రపై జరిగిన దాడిని ఖండిస్తున్నానని చెప్పారు. రేపు కోరుట్లలో సాయంత్రం 4 గంటలకు నిర్వహించే సభలో చాలామంది నేతలు బీజేపీలో చేరబోతున్నారని తెలిపారు. మునుగోడు ఉపఎన్నిక నేపథ్యంలో కోరుట్ల సభ చాలా కీలకమన్నారు. రాబోయే ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమన్నారు.

రాష్ట్రాభివృద్ధిలో కేంద్రం నిధులు

రాష్ర్టంలో గత ఏడాదిగా ప్రజాస్వామ్య పద్ధతిలో జరుగుతున్న ప్రజా ఆందోళనను అడ్డుకోవడానికి సీఎం కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని తరుణ్ చుగ్ ఆరోపించారు. బండి సంజయ్ ను పోలీసులు ఆయన కార్యాలయం నుంచి లాఠీ ఛార్జ్ చేసి తీసుకెళ్లారని చెప్పారు. నిజామాబాద్ లో అభివృద్ధి పనులు చేయకుండా ఎంపీ ధర్మపురి అర్వింద్ ను అడ్డుకుంటున్నారని, నియోజకవర్గంలో తిరగనివ్వకుండా దాడులు చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ర్టంలో చేపట్టిన రోడ్ల నిర్మాణాల్లో కేంద్ర నిధులు ఉన్నాయని, ప్రధాని నరేంద్ర మోడీ తెలంగాణ అభివృద్ధి కోసం నిధులు కేటాయిస్తున్నారని తెలిపారు.