IPL 2026 : ఐపీఎల్ బ్లాక్ టికెట్లపై పోలీసుల నిఘా.. 2 రోజుల్లో 10 కేసులు నమోదు

IPL 2026 : ఐపీఎల్ బ్లాక్ టికెట్లపై పోలీసుల నిఘా.. 2 రోజుల్లో 10 కేసులు నమోదు

హైదరాబాద్‌లో ఐపీఎల్ ఫీవర్ పీక్స్‌కు చేరింది. ఇదే సమయాన్ని క్యాష్ చేసుకునేందుకు కొందరు కేటుగాళ్లు ఐపీఎల్ బ్లాక్ టికెట్ల దందాను ముమ్మరం చేశారు. అయితే, ఈ బ్లాక్ మార్కెట్ దందాపై హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ పోలీసులు గట్టి నిఘా పెట్టారు. రూల్స్ బ్రేక్ చేసి బ్లాక్ టికెట్లు అమ్ముతున్న వారిపై కొరడా ఝులిపిస్తున్నారు.

గడిచిన కేవలం రెండు రోజుల వ్యవధిలోనే పోలీసులు  నగరంలోని పలు  పోలీస్ స్టేషన్ల పరిధిలో ఏకంగా 10 కేసులు నమోదు చేశారు. ఇందులో ఎల్బీనగర్‌లో 3 కేసులు, కుషాయిగూడలో 2 కేసులు, ఇక మ్యాచ్ జరుగుతున్న ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలోనే అత్యధికంగా 5 కేసులు నమోదయ్యాయి.

అసలు టికెట్ ధరపై మూడు నుండి నాలుగు రెట్లు అదనంగా వసూలు చేస్తూ, క్రికెట్ అభిమానుల జేబులకు చిల్లు పెడుతున్నారు ఈ కేటుగాళ్లు. ముఖ్యంగా ఉప్పల్ స్టేడియం చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో టాస్క్ ఫోర్స్ పోలీసులు ప్రత్యేక నిఘా ఉంచారు. సివిల్ డ్రెస్‌లో తిరుగుతూ బ్లాక్ టికెట్లు అమ్ముతున్న వారిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుంటున్నారు.క్రికెట్ క్రేజ్‌ను ఆసరాగా చేసుకుని మోసాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరిస్తున్నారు.