గడిపెద్దపూర్ లో 540 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత

గడిపెద్దపూర్ లో 540 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత
  • 4 వెహికల్స్​ సీజ్, నలుగురి అరెస్ట్​ ​ 

మెదక్, అల్లాదుర్గం, వెలుగు: జిల్లాలో పెద్ద ఎత్తున జరుగుతున్న రేషన్​ బియ్యం అక్రమ దందా గుట్టురట్టయ్యింది. ఇందుకు సంబంధించిన వివరాలను ఎస్పీ బాలస్వామి మంగళవారం మీడియాకు వెల్లడించారు. అల్లాదుర్గం మండలం గడిపెద్దపూర్ లోని  శ్రీ సాయి వెంకటేశ్వర రైస్ మిల్ యజమాని రమేశ్ రేషన్​బియ్యాన్నికొనుగోలు చేసి అమ్ముతున్నట్టు సమాచారం అందిందన్నారు.

ఈ మేరకు జిల్లా టాస్క్ ఫోర్స్ సిబ్బంది దాడి చేసి రైస్ మిల్ దగ్గర వాహనాల్లో తరలిస్తన్న 540 క్వింటాళ్ల బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. పట్టుబడిన పీడీఎస్​రైస్​ విలువ రూ.10.80 లక్షలు ఉంటుందని వివరించారు. బియ్యాన్ని రవాణా చేస్తు పట్టుడిన వాహనాల విలువ రూ. 23 లక్షలు ఉంటుందన్నారు.  రైస్​మిల్​యజమాని రమేశ్​పై కేసు నమోదు చేయడంతో పాటు, రేషన్​ బియ్యాన్ని తరలిస్తున్న రంగారెడ్డి జిల్లా కొందుర్గు మండలం చిన్న వెలికి చర్లకు చెందిన చకాని సాయి విక్రమ్, ప్రేమ్​కుమార్​గౌడ్, కర్నాటక రాష్ట్రం బీదర్​జిల్లా సిర్సి జీపీ పరిధి హసిన్పూర్​కు చెందిన గుంబర్ బస్వరాజ్ 

నల్గొండ జిల్లా చినతపల్లి మండలం ఉమ్మంతలపల్లికి చెందిన బాలయ్య, సంగారెడ్డి జిల్లా కల్హేర్​మండలం మాణిక్​ నాయక్​ తండాకు చెందిన సబావత్ జైరామ్ ను అరెస్ట్​ చేసినట్టు వివరించారు. సమావేశంలో డీఎస్పీ రాజేశ్, సీఐ రేణుక, డీటీ ప్రణీత రెడ్డి,  సీఐ తిరుమలేశ్, ఎస్ఐ ప్రవీణ్ రెడ్డి పాల్గొన్నారు.