హనుమకొండ జిల్లాలో సర్కారు భూముల రక్షణకు టాస్క్ ఫోర్స్

హనుమకొండ జిల్లాలో సర్కారు భూముల రక్షణకు టాస్క్ ఫోర్స్
  • ఆరుగురు ఆఫీసర్లతో టీమ్ ఏర్పాటు చేసిన కలెక్టర్
  • ఆర్డీవోకు లీడ్ రోల్ బాధ్యతలు
  • చెరువులు, నాలాలు, ప్రభుత్వ భూముల ఆక్రమణలకు చెక్
  • ఆక్రమణదారులపై క్రిమినల్​ కేసులకు చర్యలు 

హనుమకొండ, వెలుగు: జిల్లాలోని ప్రభుత్వ భూములను పరిరక్షించడంతో పాటు ఆక్రమణల అంతు తేల్చేందుకు హనుమకొండ కలెక్టర్, జీడబ్ల్యూఎంసీ ఇన్​చార్జి కమిషనర్ చాహత్ బాజ్ పాయ్ సిద్ధమయ్యారు. ఈ మేరకు చెరువులు, నాలాలు, ఇతర ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ కోసం ఆరుగురు సభ్యులతో కూడిన ప్రత్యేక టాస్క్ ఫోర్స్ టీమ్ ను నియమిస్తూ శుక్రవారం ప్రొసీడింగ్స్ ఇచ్చారు. ఆర్డీవో ఆధ్వర్యంలో పోలీస్, ఇరిగేషన్, జీడబ్ల్యూఎంసీ, సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్, కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫీసర్లు కమిటీలో సభ్యులుగా 
ఉంటారు. 

ఆర్డీవో నేతృత్వంలో ఆరుగురు సభ్యుల టీం..

వరంగల్ నగరంలో చాలాచోట్ల ప్రభుత్వ భూములు, పార్కులు, నాలాలు, చెరువులు ఆక్రమణకు గురయ్యాయి. నాలుగు రోజుల కింద వరంగల్ పట్టణ నడిబొడ్డున న్యూశాయంపేట శివారు సర్వే నెంబర్ 23లో రూ.కోట్లు విలువ చేసే భూమిని కొంతమంది ఆక్రమించేందుకు ప్రయత్నించగా, విషయం తెలుసుకున్న ఆఫీసర్లు అడ్డుకుని కబ్జాకు చెక్ పెట్టారు. అదే స్ఫూర్తితో ఇకపై జిల్లాలోని ప్రభుత్వ భూములు ఆక్రమణలకు గురికావద్దనే ఉద్దేశంతో కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్ జిల్లాస్థాయి టాస్క్ ఫోర్స్ టీమ్ ను ఏర్పాటు చేశారు. 

ఈ టాస్క్ ఫోర్స్ కమిటీకి ఆర్డీవో టీమ్ లీడర్ గా వ్యవహరించనున్నారు. పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ (ఏసీపీ), ఇరిగేషన్ నుంచి డివిజనల్ ఇంజినీర్, జీడబ్ల్యూఎంసీ నుంచి అసిస్టెంట్ సిటీ ప్లానర్ (ఏసీపీ), కుడా నుంచి అసిస్టెంట్ ప్లానింగ్ ఆఫీసర్, సర్వే డిపార్ట్మెంట్ నుంచి డిప్యూటీ ఇన్ స్పెక్టర్ ను ఈ టాస్క్ ఫోర్స్ లో సభ్యులుగా అవకాశం కల్పించారు.

ఆక్రమణలు జరగకుండా యాక్షన్..

జిల్లా పరిధిలోని జీడబ్ల్యూఎంసీ, కుడా భూములతో పాటు చెరువులు, నాలాలు, ఇతర ప్రభుత్వ భూముల పరిరక్షణ బాధ్యతలను కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్ టాస్క్ ఫోర్స్ టీమ్ కు అప్పగించారు. ఈ టాస్క్ ఫోర్స్ టీం సభ్యులు సర్కారు ల్యాండ్స్, వాటర్ బాడీస్ ఆక్రమణకు గురి కాకుండా చర్యలు చేపట్టాల్సి ఉంటుంది. ఈ మేరకు వారంతా క్షేత్రస్థాయి పరిస్థితులను పరిశీలించిన ఆక్రమణకు ఆస్కారం ఉన్నచోట బోర్డ్స్, ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలి. 

కొత్తగా ఎలాంటి ఆక్రమణలు జరగకుండా చూడాలి. అంతేగాకుండా ఆక్రమణలను చట్టప్రకారం తొలగించడంతో పాటు సంబంధిత ల్యాండ్ గ్రాబర్స్ పై క్రిమినల్ కేసులు కూడా నమోదు చేసేలా చర్యలు చేపట్టాలి. ముఖ్యంగా ప్రభుత్వ భూములకు సంబంధించిన ప్రాపర్ రికార్డ్స్ మెయింటెయిన్ చేయడంతో పాటు తనిఖీల సమయంలో గుర్తించిన ఆక్రమణలు తొలగించి, వాటి ఫొటోస్, పంచనామా రిపోర్టులు, జియో కోఆర్డినేట్స్ తో సర్కారు ల్యాండ్స్ పరిరక్షణకు చర్యలు చేపట్టాల్సి ఉంటుంది. 

కాగా, టాస్క్ ఫోర్స్ చేపట్టే చర్యలకు సంబంధిత శాఖలు సమన్వయంతో పని చేయాలని కలెక్టర్ ఆదేశించారు. ఏవైనా ఆక్రమణల తొలగింపు కోసం అవసరమైన మ్యాన్ పవర్, మెషినరీ కోసం జీడబ్ల్యూఎంసీ డీఆర్ఎఫ్, సీఎంవోహెచ్ సహకారం తీసుకోవాలని కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్ సూచించారు. ప్రభుత్వ భూముల పరిరక్షణకు ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసి, ఆక్రమణల తొలగింపునకు చర్యలు చేపడుతుండటంతో నగర వాసుల్లో హర్షం వ్యక్తమవుతోంది.