లిక్క‌ర్ సేల్ రికార్డ్.. ఒక్కరోజే రూ.172 కోట్లు: షాప్స్ మూసేయాల‌ని మ‌హిళ‌ల ధ‌ర్నా

లిక్క‌ర్ సేల్ రికార్డ్.. ఒక్కరోజే రూ.172 కోట్లు: షాప్స్ మూసేయాల‌ని మ‌హిళ‌ల ధ‌ర్నా

లాక్ డౌన్ ఆంక్ష‌ల స‌డ‌లింపుతో త‌మిళ‌నాడు స‌ర్కార్ గురువారం లిక్క‌ర్ సేల్స్ ప్రారంభించింది. దాదాపు నెల‌న్న‌ర రోజులుగా మూత‌ప‌డిన వైన్ షాపులు తెరుచుకోవ‌డంతో మ‌ద్యం ప్రియులు ఒక్క‌సారిగా వేల సంఖ్య‌లో క్యూక‌ట్టారు. రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో లిక్క‌ర్ దొరుకుతుంద‌న్న ఆనందంలో.. క‌రోనా వైర‌స్ బారిన‌ప‌డకుండా సోష‌ల్ డిస్టెన్ పాటించాల‌న్న విష‌యాన్ని కూడా మ‌ర్చిపోయారు. త‌మిళ‌నాడులో ప్ర‌భుత్వ ఆధ్వ‌ర్యంలో న‌డిచే ట‌స్మాక్ లిక్క‌ర్ షాపులు గురువారం ఓపెన్ అయ్యే స‌మ‌యానికంటే ముందే.. గుంపులు గుంపులుగా షాపుల మీద‌ప‌డ్డారు జ‌నం. వారిని దారిలోకి తెచ్చి.. క్యూల్లో నిల‌బెట్టేందుకు పోలీసులు నానాపాట్లు పడాల్సి వ‌చ్చింది. అయిన‌ప్ప‌టికీ మ‌నిషికీ మ‌నిషికి మ‌ధ్య ఆర‌డుగుల దూరం ఉండాల‌న్న సోష‌ల్ డిస్టెన్స్ నిబంధ‌న‌ను అమ‌లు చేయ‌డం వారి వ‌ల్ల కాలేదు. అయితే కొంత మేర తోపులాట‌లు జ‌ర‌గ‌కుండా కంట్రోల్ చేయ‌గ‌లిగారు. కొన్ని చోట్ల త‌ప్ప‌నిస‌రి ప‌రిస్థితుల్లో లాఠీచార్జ్ కూడా చేయాల్సి వ‌చ్చింది.

తొలి రోజే రూ.172 కోట్లు

త‌మిళ‌నాడు స్టేట్ మార్కెటింగ్ కార్పొరేష‌న్ (ట‌స్మాక్) ఆధ్వ‌ర్యంలో మొత్తం 5146 లిక్క‌ర్ షాపులు ఉన్నాయి. మామూలు స‌మ‌యాల్లో ప్ర‌తి రోజు రూ.70 – 80 కోట్ల మ‌ధ్య సేల్స్ జ‌రుగుతాయి. అయితే ప్ర‌స్తుతం క‌రోనా వైర‌స్ వ్యాప్తి నేప‌థ్యంలో కంటైన్మెంట్ జోన్ల‌లో ఉన్న షాపుల‌ను తెరిచేందుకు త‌మిళ‌నాడు ప్ర‌భుత్వం అనుమ‌తివ్వ‌లేదు. దీంతో గురువారం 3750 షాపుల్లో మాత్ర‌మే సేల్స్ జ‌రిగాయి. అయితే లిక్క‌ర్ సేల్స్ మొద‌లైన తొలి రోజే మామూలు రోజుల్లో కంటే భారీగా ఆదాయం వ‌చ్చింది. రాష్ట్రం మొత్తంలో రికార్డు స్థాయిలో రూ.172.59 కోట్ల రెవెన్యూ వ‌చ్చింది. అత్య‌ధికంగా మ‌ధురై జోన్ లోనే రూ.46.78 కోట్ల అమ్మ‌కాలు జ‌రిగాయి. ఆ త‌ర్వాత తిరుచ్చిలో రూ.45.67 కోట్లు, సేలం జోన్ లో రూ.41.56 కోట్లు, కోయంబ‌త్తూర్ జోన్లో రూ. 28.42 కోట్లు, చెన్నై జోన్లో రూ.10.16 కోట్ల రెవెన్యూ వ‌చ్చింది. పొంగ‌ల్, న్యూఇయ‌ర్ స‌మ‌యాల్లో మాత్ర‌మే రాష్ట్రంలో 120 – 200 కోట్ల మేర లిక్క‌ర్ సెల్స్ జ‌రుగుతాయ‌ని ట‌స్మాక్ అధికారులు చెబుతున్నారు.

లిక్క‌ర్ అమ్మ‌కాల‌కు వ్య‌తిరేకంగా ధ‌ర్నా

త‌మిళ‌నాడులో ఇప్ప‌టికే 5409 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయి. అందులో 37 మంది మ‌ర‌ణించ‌గా.. 1547 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. అయితే కొద్ది రోజులుగా ఆ రాష్ట్రంలో ప్ర‌తి రోజూ వంద‌ల సంఖ్య‌లో క‌రోనా కేసులు న‌మోద‌వుతున్నాయి. గురువారం ఒక్క‌రోజే 580 పాజిటివ్ కేసులు వ‌చ్చాయి. ఈ స‌మ‌యంలో లిక్క‌ర్ షాపులు తెర‌వ‌డంపై ప్ర‌జా సంఘాల‌తో పాటు ప‌లు రాజ‌కీయ పార్టీలు కూడా వ్య‌తిరేకిస్తున్నాయి. లిక్క‌ర్ షాపుల‌ను త‌క్ష‌ణం మూసేయాలంటూ మ‌ధురైలో భారీ సంఖ్య‌లో మ‌హిళ‌లు, సీపీఎం కార్య‌క‌ర్త‌లు రోడ్ల‌పైకి వ‌చ్చి ధ‌ర్నాకు దిగారు. వారిని అడ్డుకునేందుకు ప్ర‌య‌త్నించ‌గా.. పోలీసులకు నిర‌స‌న‌కారుల‌కు మ‌ధ్య వాగ్వాదం జ‌రిగింది. అతి క‌ష్టం మీద వారంద‌రినీ అరెస్టు చేశారు పోలీసులు.