రిలయన్స్ కు పోటీ.. బిగ్‌బాస్కెట్‌లోకి టాటా గ్రూప్

రిలయన్స్ కు పోటీ.. బిగ్‌బాస్కెట్‌లోకి టాటా గ్రూప్
  • ఇన్వెస్ట్‌మెంట్ కోసం చర్చలు
  • అక్టోబర్ చివరి కల్లా డీల్‌పై క్లారిటీ
  • రిలయన్స్​కి గట్టి పోటీ

న్యూఢిల్లీ: ఆన్‌లైన్ గ్రోసరీస్ యూనికార్న్ బిగ్‌బాస్కెట్‌తో జత కట్టాలని టాటా గ్రూప్ చూస్తోంది. ఈ నెల చివరి కల్లా డీల్‌పై ఒక నిర్ణయం తీసుకుంటారని సంబంధిత వ్యక్తులు చెప్పారు. శాల్ట్ నుంచి కార్ల వరకు వ్యాపారాలున్న టాటా గ్రూప్ బిగ్‌బాస్కెట్‌లో 20 శాతం వాటాను కొనుగోలు చేస్తోందని, ఈ డీల్‌లో భాగంగా రెండు బోర్డు సీట్లను టాటా గ్రూప్ పొందుతుందని సంబంధిత వ్యక్తులు అన్నారు. కరోనా మహమ్మారితో బిగ్‌బాస్కెట్‌ గ్రోసరీ వ్యాపారాలు బాగా పుంజుకున్నాయి. కన్జూమర్లు తమకు కావాల్సిన గ్రోసరీలను, నిత్యావసర వస్తువులను ఆన్‌లైన్‌గానే కొనుగోలు చేశారు. ఈ ఆన్‌లైన్ గ్రోసరీ రిటైలర్ ఫండ్స్ కోసం ఇప్పటికే సింగపూర్ ప్రభుత్వ టెమాసెక్, అమెరికాకు చెందిన జనరేషన్ పార్టనర్స్, ఫిడెలిటీ వంటి కొత్త ఇన్వెస్టర్లతో కూడా చర్చలు జరుపుతోంది. 350–400 మిలియన్ డాలర్ల వరకు ఫండ్‌ను సేకరించాలనుకుంటోంది. దీంతో కంపెనీ వాల్యూయేషన్ 33 శాతం పెరిగి 2 బిలియన్ డాలర్లకు చేరుకోనుంది. బిగ్‌బాస్కెట్‌తో చేతులు కలుపడం ద్వారా టాటా తన డిజిటల్ ఉనికిని మరింత పెంచుకోనుంది. అమెజాన్, ముకేశ్ అంబానీ రిటైల్ కంపెనీలకు టాటా గ్రూప్ గట్టి పోటీ ఇవ్వనుంది. ఆగస్ట్‌ లో రిలయన్స్ ఇండస్ట్రీస్ కిశోర్ బియానీకి చెందిన ఫ్యూచర్ గ్రూప్ రిటైల్, హోల్‌సేల్ వ్యాపారాలను కొనుగోలు చేసింది. ఫ్యూచర్ గ్రూప్ బ్రాండ్లు,సప్లయి చెయిన్లు రిలయన్స్ ఈకామర్స్ ప్లాట్‌ఫామ్ జియోమార్ట్‌ కు సాయం చేయనున్నాయి. ఫ్యూచర్ గ్రూప్‌కు 420 సిటీల్లో 1,800 వరకు స్టోర్లున్నాయి. ఈ డీల్‌తో రిలయన్స్ రిటైల్ రూ.2 లక్షల కోట్ల రిటైల్ టర్నోవర్‌‌ను తన కంట్రోల్‌లోకి తెచ్చుకుంది. దేశంలో అనధికారిక రిటైల్ రంగంలో జరుగుతోన్న మూడింట ఒక వంతు వాటాను రిలయన్స్ రిటైల్ సొంతం చేసుకుంది.

సూపర్ యాప్ కోసం వాల్‌మార్ట్‌తో జత..

జియో మాదిరి రిలయన్స్ రిటైల్‌కు గ్లోబల్ ఇన్వెస్టర్ల నుంచి మస్తు మనీ వస్తున్నాయి. సిల్వర్ లేక్, కేకేఆర్, జనరల్ అట్లాంటికా, ముబదాలా, జీఐసీ, టీపీజీ, ఏడీఐఏ వంటి గ్లోబల్ ఇన్వెస్టర్ల నుంచి 5 బిలియన్ డాలర్లకు పైగా ఇన్వెస్ట్‌మెంట్లు రిలయన్స్ రిటైల్‌కు వచ్చాయి. టాటా గ్రూప్ కూడా తన ఆన్‌లైన్‌ ఉనికిని మరింత పెంచుకోవాలనుకుంటోంది. టాటా గ్రూప్ త్వరలో లాంఛ్ చేయబోతున్న ‘సూపర్ యాప్’ కోసం వాల్‌మార్ట్‌తో చర్చలు జరుపుతోంది. వాల్‌మార్ట్‌ ఈ యాప్‌ కోసం టాటా గ్రూప్‌లో 25 బిలియన్ డాలర్ల వరకు ఇన్వెస్ట్ చేస్తోందని
|తెలుస్తోంది.