టాటా మోటార్స్ పాపులర్ మోడల్స్ అయిన కొత్త టియాగో (పెట్రోల్ వెర్షన్) & టియాగో ఈవీ (ఎలక్ట్రిక్) కార్లను వచ్చే వారం మార్కెట్లోకి తీసుకురావడానికి రెడీ అయింది. దీనికి సంబంధించిన అధికారిక లాంచ్ తేదీని 28 మే 2026గా ఫిక్స్ చేశారు. తక్కువ బడ్జెట్‌లో, సిటీ డ్రైవింగ్‌కు అనుకూలంగా ఉండేలా లేటెస్ట్ స్టైల్, సరికొత్త ఫీచర్లతో ఈ కార్లను డిజైన్ చేశారు.
కొత్త, స్పోర్టీ లుక్
పాత మోడల్‌తో పోలిస్తే కొత్త టియాగో కారు మరింత స్టైలిష్‌గా, షార్ప్ లుక్‌తో కనిపిస్తుంది. ముందు భాగంలో లైట్లను కలుపుతూ సన్నటి నల్లటి ప్యానెల్ ఉంటుంది, ఇది కారుకు మరింత వెడల్పాటి రూపాన్ని ఇస్తుంది. కొత్త బంపర్, పెద్ద నలుపు రంగు విభాగాలు, ఫాగ్ ల్యాంప్స్ దీనికి స్పోర్టీ లుక్‌ను తెచ్చిపెట్టాయి. దీని కొత్త అల్లాయ్ వీల్స్ కారుకు ప్రీమియం లుక్‌ను ఇస్తాయి. ఇక వెనుక భాగంలో వెనుక వైపు ఉన్న లైట్లను కలుపుతూ ఒక పొడవైన ప్యానెల్, మూడు నిలువు లైట్ డిజైన్లు ఉన్నాయి. కొత్త బంపర్, టెయిల్‌గేట్ డిజైన్ చాలా క్లీన్‌గా, మోడ్రన్‌గా అనిపిస్తాయి.
టియాగో ఎలక్ట్రిక్ కారు ఎలా ఉంటుందంటే
ఈ ఎలక్ట్రిక్ కార్ డిజైన్ కూడా పెట్రోల్ కారులాగే ఉన్న.. కొన్ని ప్రత్యేక మార్పులు చేశారు. గాలి వల్ల కారు వేగానికి అడ్డంకి లేకుండా ఉండేందుకు (ఏరోడైనమిక్స్ కోసం) ముందు వైపు గ్రిల్‌ను పూర్తిగా మూసివేశారు. కారు పైభాగం మింట్ గ్రీన్ కలర్, బ్లాక్ రూఫ్ ఇంకా వెనుక ఉన్న EV బ్యాడ్జ్ దీనికి ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఇస్తాయి.
ఇంటీరియర్ ఫీచర్లు
కారు లోపలి భాగం ఎలా ఉంటుందో టాటా కంపెనీ ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. కానీ, పాత మోడళ్లతో పోలిస్తే చాలా పెద్ద మార్పులు ఉండబోతున్నాయి. రీడిజైన్ చేసిన డాష్‌బోర్డ్, పెద్ద టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, కొత్త డిజిటల్ మీటర్, లేటెస్ట్ సీట్లు ఉండే అవకాశం ఉంది.
ఇంజన్ అండ్ మైలేజ్
పెట్రోల్ వేరియంట్ 1.2-లీటర్ ఇంజన్‌తో వస్తుంది ఇంకా 86PS పవర్, 113Nm టార్క్ ఇస్తుంది. ఈ కార్ 5-స్పీడ్ మాన్యువల్ & ఆటోమేటిక్ (AMT) గేర్ ఆప్షన్లలో లభిస్తుంది.
సీఎన్‌జీ వేరియంట్ చూస్తే ఎక్కువ మైలేజ్ కోరుకునే వారి కోసం సీఎన్‌జీ మోడల్ కూడా ఉంది. ఈ మోడల్ 75.5PS పవర్, 96.5Nm టార్క్ ఇస్తుంది. ఇందులో వెనుక డిక్కీ స్థలం వృధా కాకుండా ఉండేందుకు రెండు చిన్న సిలిండర్లను ఉపయోగించారు.
Tiago ఎలక్ట్రిక్ వేరియంట్ ప్రస్తుత మోడల్ 19.2kWh, 24kWh బ్యాటరీ ఆప్షన్లతో, ఒకసారి ఛార్జ్ చేస్తే 223 కిలోమీటర్ల నుండి 293 కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తుంది. కొత్త మోడల్లో మరింత మెరుగైన బ్యాటరీని ఇచ్చే అవకాశం ఉంది. అలాగే టాటా పంచ్.ఈవీలాగా బ్యాటరీని రెంట్ తీసుకునే (BaaS - Battery-as-a-Service) పద్ధతిని కూడా ఇందులో ప్రవేశపెట్టవచ్చు.
ధర ఎంత ఉండొచ్చంటే
కొత్త ఫీచర్లతో వస్తున్నందున, కొత్త మోడల్స్ ధర ప్రస్తుత కార్ల కంటే కొంచెం ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న మోడళ్ల (ఎక్స్-షోరూమ్) ధరలు చూస్తే :
ప్రస్తుత పెట్రోల్ టియాగో ధర రూ. 4.59 లక్షల నుండి రూ. 6.82 లక్షల మధ్య ఉండగా... టియాగో.ఈవీ (ఎలక్ట్రిక్) ధర రూ. 7.99 లక్షల నుండి రూ. 11.14 లక్షల మధ్య ఉంది.
