మార్చి నెలాఖరు వస్తోంది. ఇయర్ ఎండ్ సేల్స్ కింద కార్ల కంపెనీలు ఆఫర్లు ఇస్తాయిలే అని కొత్త కారు కొనాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే ఈ షాకింగ్ వార్త మీకే. ఏప్రిల్ 1వ తేదీ నుంచి దేశీయ కార్ల తయారీ దిగ్గజం టాటా మోటార్స్ తన కార్ మోడళ్ల రేట్లను పెంచబోతోంది. పెరిగిన ఇన్‌పుట్ ఖర్చుల భారాన్ని తగ్గించుకోవడానికి కంపెనీ ఈ నిర్ణయం తీసుకుంది. కేవలం టాటా మోటార్స్ మాత్రమే కాదు.. ఇతర లగ్జరీ కార్ల తయారీ సంస్థలైన మెర్సిడెస్ బెంజ్, బీఎమ్‌డబ్ల్యూ కూడా తమ వాహనాల ధరలను పెంచుతున్నట్లు ప్రకటించాయి. దీంతో ఏప్రిల్ నుంచి సామాన్యుడి కారు కల కాస్త భారంగా మారిపోనుంది.
టాటా కార్ల రేట్లు ఎంత పెరుగుతాయి?
టాటా మోటార్స్ తన పెట్రోల్, డీజిల్, సీఎన్జీ వాహనాలపై 0.5 శాతం ధరను పెంచుతున్నట్లు ప్రకటించింది. మోడల్, వేరియంట్‌ను బట్టి ఈ పెంపు సుమారు రూ.2వేల 285 నుంచి అత్యధికంగా రూ.13వేల వరకు ఉండొచ్చని తెలుస్తోంది. ప్రస్తుతం టాటా టియాగో ప్రారంభ ధర రూ.4లక్షల 57వేలు ఉండగా, టాటా సఫారి రేటు రూ.13లక్షల 29వేల నుంచి స్టార్ట్ అవుతోంది. అయితే ఎలక్ట్రిక్ వాహనాల ధరల విషయంలో కంపెనీ ఇప్పటివరకు ఎటువంటి మార్పులను ప్రకటించలేదు.
లగ్జరీ కార్లు కూడా ప్రియం:
మరోవైపు విదేశీ లగ్జరీ కార్ల కంపెనీలైన మెర్సిడెస్ బెంజ్, బీఎమ్‌డబ్ల్యూ కూడా ఏప్రిల్ 1 నుండి తమ కార్ల ధరలను ఏకంగా 2 శాతం వరకు పెంచుతున్నట్లు ప్రకటించాయి. రూపాయి విలువ పడిపోవటం, సరఫరా గొలుసులో ఇబ్బందుల వల్ల ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని ఆ సంస్థలు తెలిపాయి. ఇక మారుతి సుజుకి, హ్యుందాయ్ వంటి కంపెనీలు మాత్రం ఇంకా అధికారిక ప్రకటన చేయనప్పటికీ.. మార్కెట్ పరిస్థితులను బట్టి అవి కూడా ధరల పెంపునే ఫాలో అయ్యే అవకాశం ఉందని ఆటో నిపుణులు అంటున్నారు.
ఒకపక్క కార్ల ధరలతో పాటు మరోపక్క ఇంధన ధరలు కూడా వాహనదారులను కలవరపెడుతున్నాయి. సాధారణ పెట్రోల్ ధరల్లో పెద్దగా మార్పు లేకపోయినప్పటికీ.. ప్రీమియం పెట్రోల్ ధర లీటరుకు రూ.2.09 నుండి రూ.2.35 వరకు పెంచాయి దేశీయ ఆయిల్ కంపెనీలు ఇరాన్ యుద్ధం కారణంగా. ఒకవైపు వాహనం కొనుగోలు ఖర్చు, మరోవైపు నిర్వహణ వ్యయం పెరగడం వల్ల మధ్యతరగతి కొనుగోలుదారులు తమ బడ్జెట్‌ను మళ్లీ లెక్కవేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. మార్చి 31లోపు కారు బుక్ చేసుకుంటే ఈ అదనపు ధరల భారం నుంచి తప్పించుకోవచ్చని డీలర్లు చెబుతున్నారు. సో ఇయర్ ఎండ్ సేల్స్ కింద కార్ల రేట్లు తగ్గుతాయి అని వేచి చూస్తున్న చాలా మందికి తాజా రేట్ల పెంపు ప్రకటన షాక్ ఇచ్చిందనే చెప్పుకోవాలి.
