అమ్మకానికి టీసీఎస్​ షేర్లు..వీటి విలువ రూ.9 వేల కోట్లు

అమ్మకానికి టీసీఎస్​ షేర్లు..వీటి విలువ రూ.9 వేల కోట్లు

న్యూఢిల్లీ :  మనదేశంలోనే అతిపెద్ద సాఫ్ట్‌‌వేర్ సేవల ఎగుమతిదారు టీసీఎస్​కు చెందిన హోల్డింగ్ కంపెనీ అయిన టాటా సన్స్, దాదాపు రూ. 9,300 కోట్ల విలువైన షేర్లను అమ్మకానికి పెట్టనుంది. బ్లాక్ డీల్స్‌‌లో ఒక్కో షేరును రూ. 4,001 చొప్పున  2.34 కోట్ల షేర్లను విక్రయించడానికి ఆఫర్ చేస్తోంది. ఫ్లోర్​ ధర సోమవారం ముగింపు ధర కంటే 3.6 శాతం తక్కువగా ఉంది. టాటా సన్స్​కు టీసీఎస్​లో 72.38శాతం వాటా ఉంది.

ఈ షేర్లు గత ఏడాదిలో 30శాతం ర్యాలీ చేశాయి. సోమవారం ఇంట్రాడేలో రూ. 4,254.45 తాజా రికార్డు గరిష్ట స్థాయిని తాకిన తర్వాత,  బీఎస్‌‌ఈలో టీసీఎస్ షేర్ 1.7శాతం క్షీణించి రూ. 4,144.75 వద్ద ముగిసింది. 15 లక్షల కోట్ల మార్కెట్ క్యాపిటలైజేషన్‌‌తో, రిలయన్స్ ఇండస్ట్రీస్  తర్వాత టీసీఎస్​ భారతదేశంలో  రెండవ అత్యంత విలువైన లిస్టెడ్ కంపెనీ.  టాటా సన్స్ ఐపీఓ లేకుండా చేయడానికే షేర్లను అమ్ముతోందని మార్కెట్​పరిశీలకులు అంటున్నారు.