
తౌక్టే తుఫాన్ క్రమంగా అరేబియా సముద్రంలో అల్పపీడనంగా మారి క్రమేపీ తీవ్ర తుఫాన్‌గా మారింది. ఇప్పుడది గుజరాత్ వైపు పయనిస్తోందని భారత వాతావరణ శాఖ తెలిపింది. తెల్లవారుజామున 2 గంటల 30 నిమిషాల సమయంలో పాంజిమ్-గోవాకు నైరుతి దిశలో 150 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉందని తెలిపింది. ముంబైకి దక్షిణాన 490 కిలోమీటర్లు, గుజరాత్‌లోని వెరవల్‌కు730 కిలోమీటర్ల దూరంలో ఉందని తెలిపింది. ఈ నెల 18న ఉదయం గుజరాత్ భావ్ నగర్ జిల్లాలోని మహువ, పోర్ బందర్ మధ్య తౌక్టే తుఫాన్ తీరం దాటుతుందని ఐఎండీ అంచనా వేసింది.
కాగా.. తుఫాన్ నేపథ్యంలో పూరి-ఓఖా-పూరి మధ్య నడిచే స్పెషల్ ట్రెయిన్‌ను ఈస్ట్ కోస్ట్ రైల్వే రద్దు చేసింది. ఈ రైలు 16న పూరి నుంచి ఓఖా, మే 19న ఓఖా నుంచి పూరికి ప్రయాణించాల్సి ఉంది. భారీ వర్ష సూచనతో ముంబై అధికారులు అలర్ట్ అయ్యారు. తుఫాన్ భయంతో ఓ కరోనా సెంటర్‌లోని రోగులను ముంబై మున్సిపల్ అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు.
ఇక తుఫాన్ ధాటికి కేరళలో ఇద్దరు చనిపోయారు. ఎర్నాకుళంలో ఒకరు, కోజికోడ్ జిల్లాలో ఒకరు ప్రాణాలు కోల్పోయారు. పశ్చిమ మహారాష్ట్ర సహా మొత్తం కొంకణ్ తీరానికి వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. మహారాష్ట్రలోని కొల్లాపూర్, సతారాలో ఇవాళ మరియు రేపు భారీ వర్షాలు పడే ఛాన్స్ ఉందని ఐఎండీ అంచనా వేసింది. గుజరాత్ తీర ప్రాంతాల్లోనూ భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. జునాగఢ్, గిర్, సోమనాథ్, సౌరాష్ట్ర, కచ్, డయ్యు ఏరియాలపై తుఫాన్ ఎఫెక్ట్ ఉంటుందని తెలిపింది. ఈ ఏరియాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని తెలిపింది. తుఫాన్ ప్రభావంతో గోవాలోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి. తుఫాన్ ధాటికి రోడ్ల మధ్యలో భారీ చెట్లు మరియు కొమ్మలు విరిగిపడ్డాయి. ఈ చెట్ల, కొమ్మలు రోడ్ల మీద పార్క్ చేసిన వాహనాల మీద పడటంతో భారీగా నష్టం వాటిల్లింది.
తౌక్టే తుఫాను ప్రభావంతో సముద్రంలో అలల తీవ్రత భారీగా ఉండటంతో మత్స్యకారులెవరూ వేటకు వెళ్లకూడదని భారత కోస్ట్ గార్డ్ హెచ్చరిక జారీ చేసింది.