New Tax Rules: తప్పుడు టాక్స్ డిడక్షన్ క్లెయిమ్స్ ఇక కుదరవ్.. షేక్ చేస్తున్న కొత్త రూల్స్

New Tax Rules: తప్పుడు టాక్స్ డిడక్షన్ క్లెయిమ్స్ ఇక కుదరవ్.. షేక్ చేస్తున్న కొత్త రూల్స్

ITR Rules: ఆర్థిక సంవత్సరం పూర్తయ్యింది. వాస్తవానికి జూన్ 30 నాటికి ప్రజలు తమ టాక్స్ ఫైలింగ్ ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంటుంది. అయితే దీనికి సంబంధించిన ఫారమ్ లను సిద్ధం చేయటంలో జరిగిన ఆలస్యం కారణంగా ఆదాయపు పన్ను శాఖ గడువును సెప్టెంబర్ 14 వరకు పొడిగిస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే కొత్తగా తీసుకొచ్చిన పన్ను రిటర్న్ ఫైలింగ్ చట్టాల్లో మార్పులు నకిలీ టాక్స్ మినహాయింపులు చేపట్టేవారికి పెద్ద శిక్షలను కలిగించనున్నాయి. ప్రజలు దీనిపై ఖచ్చితంగా అవగాహన తెచ్చుకోవటం ముఖ్యం.

వాస్తవానికి ఆదాయపు పన్ను శాఖ ఆధునిక సాంకేతికతతో పాటు ఏఐ టెక్నాలజీలను మిళితం చేసి తప్పుడు పన్ను రిటర్న్స్, పన్ను ఎగవేతలు, పన్ను మినహాయింపుల్లో మోసాలను అరికట్టడానికి అనేక చర్యలు చేపడుతోంది. తాజా మారిన చట్టాల్లో పెద్ద జరిమానాలను సైతం రూపొందించారని వెల్లడైంది. పన్ను అధికారుల దర్యాప్తులో దాదాపు 90వేల మంది ఉద్యోగులు తప్పుడు డిడక్షన్ క్లెయిమ్స్ వల్ల రూ.వెయ్యి 070 కోట్లు పన్ను ఆదాయాన్ని కోల్పోయినట్లు గుర్తించింది. దీంతో ఇలాంటి వాటిపై కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించింది.

మారిపోయిన టాక్స్ ఫైలింగ్ ప్రక్రియ..
* సెక్షన్ 80 సి కింద ఎల్ఐసీ, పీపీఎఫ్, ఈఎల్ఎస్ఎస్ పెట్టుబడులపై డిడక్షన్స్ క్లెయిమ్ చేయాలంటే పన్ను చెల్లింపుదారులు తమ ఐటీఆర్ ఫైలింగ్ ప్రక్రియలో సదరు పాలసీ నంబర్లు, సంబంధించ డాక్యుమెంట్ ఐడీలను అందించటం తప్పనిసరిగా మార్చబడింది. అలాగే సెక్షన్ 80డి కింద తీసుకునే హెల్త్ ఇన్సూరెన్స్ డిడక్షన్స్ కోసం పాలసీదారుని పేరు, పాలసీ నంబర్ తప్పనిసరిగా అందించాల్సి ఉంటుంది. 

* ఇకపోతే సెక్షన్ 80E, 80EE, 80EEA కింద హోమ్ లోన్, ఎడ్యుకేషన్ లోన్ చెల్లింపులపై పన్ను మినహాయింపులు క్లెయిన్ పొందటానికి ఐటీఆర్ ఫారంలో రుణ గ్రహీత పేరు, లోన్ అకౌంట్ నంబర్, లోన్ పొందిన తేదీల వివరాలు అందించాలి. ఇక 80EEB కింద పొందిన ఎలక్ట్రిక్ వాహన రుణాల కింద క్లెయిమ్స్ కోసం వాహన రిజిస్ట్రేషన్ నంబర్ తప్పనిసరిగా అందించాల్సి ఉంటుందని పన్ను శాఖ కొత్త మార్పుల్లో స్పష్టం చేసింది. 

* ఇవి పన్ను శాఖకు ఐటీఆర్ ఫైల్ చేసే వ్యక్తుల యాన్యువల్ ఇన్ఫర్మేషన్ స్టేట్మెంట్లను క్రాస్ వెరిఫై చేసేందుకు దోహదపడనున్నాయి. దీని ద్వారా తప్పుడు క్లెయిమ్స్ కోసం ప్రయత్నించే వారిని అరికట్టడమే లక్ష్యమని పన్ను శాఖ పేర్కొంది. అలాగే ఆటోమేటెడ్ వెరిఫికేషన్ ద్వారా అకౌంటబిలిటీ పెంచాలని చూస్తోంది. ఎవరైనా వ్యక్తులు క్లెయిమ్ ప్రక్రియలో అవసరమైన డాక్యుమెంట్లు, వివరాలను అందించటంలో విఫలమైతే 200 శాతం పెనాల్టీతో పాటు వార్షికంగా తప్పుడు క్లెయిమ్ మెుత్తంపై 24 శాతం వడ్డీని వసూలు చేయనుంది పన్ను శాఖ.

అందుకే మారిన పన్ను ఫైలింగ్ ప్రక్రియను దేశంలోని టాక్స్ పేయర్లు అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. వారు పొందాలనుకుంటున్న ప్రతి పన్ను మినహాయింపుకు ఇకపై తగిన డాక్యుమెంట్లు, వాటి వివరాలను తప్పకుండా అందించాల్సి ఉంటుంది.