
పన్ను ఎగవేతదారులకు మరింత కఠినతరమైన నిబంధనలు వచ్చేశాయి. ఆదాయపు పన్ను శాఖ సోమవారం నుంచి కొత్త ఇన్‌కమ్ ట్యాక్స్ నిబంధనలను అమల్లోకి తెచ్చింది. ఇన్‌కమ్ ట్యాక్స్(ఐటీ) డిపార్ట్‌మెంట్ జారీ చేసిన రివైజ్డ్ గైడ్‌లైన్స్‌లో ఇకపై కేవలం పెనాల్టీ, ట్యాక్స్ డిమాండ్, వడ్డీలు మాత్రమే కట్టేసి పన్ను ఎగవేత కేసుల నుంచి వ్యక్తులు లేదా సంస్థలు తప్పించుకోవడానికి వీలు లేదు. కేసును బట్టి పన్ను ఎగవేతదారులపై లీగల్ యాక్షన్ తీసుకునేలా ఐటీ డిపార్ట్‌మెంట్ కొత్త మార్గదర్శకాలను తీసుకొచ్చింది. బ్లాక్‌మనీ, బినామీ చట్టాల కింద అన్ని రకాల ఎగవేతలను ఇక నుంచి సీరియస్ నేరాలుగా ఆదాయపు పన్ను శాఖ పరిగణలోకి తీసుకుంటోంది. ఈ కేసుల్లో రాజీకి అవకాశం ఉండదు. ఈ కొత్త మార్గదర్శకాలు 2019 జూన్ 17 నుంచి అమల్లోకి తీసుకొస్తున్నామని ఆదాయపు పన్ను శాఖ చెబుతోంది. ఈ రివైజ్డ్ గైడ్‌లైన్స్‌ను సంబంధిత అథారిటీలకు సర్క్యూలేట్ చేయాలని సీనియర్ అధికారులను సెంట్రల్ బోర్డు ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సస్(సీబీడీటీ) ఆదేశించింది. సీరియస్‌గా పరిగణించే 13 రకాల నేరాలను లిస్ట్ చేసింది. అంతేకాక ఆ నేరాలను రెండు విభాగాలుగా వర్గీకరించింది. కేటగిరీ ‘ఏ’ లో చాప్టర్18–బీ కింద మూలం వద్ద మినహాయించుకున్న పన్నును చెల్లించడంలో విఫలం కావడం లేదా సెక్షన్ 115–0 కింద పన్ను చెల్లింపులను ఎగ్గొట్టడం ఉంది. ఇక కేటగిరీ‘బీ’ కింద ఉద్దేశపూర్వకంగా పన్ను ఎగ్గొట్టడం, అకౌంట్లను, డాక్యుమెంట్లను ప్రొడ్యూస్ చేయలేకపోవడం, వెరిఫికేషన్‌లో తప్పుడు వివరణ ఇవ్వడం వంటి నేరాలున్నాయి. మొదటి కేటగిరీలోని నేరాల్లో తప్పును ఒప్పుకుని పెనాల్టీలు, పన్నులు చెల్లిస్తే కేసులను ఉపసంహరించే అవకాశం ఉంటుంది. కానీ ఉద్దేశపూర్వకంగా పన్నులు ఎగ్గొట్టడం లేదా సెర్చ్ ఆపరేషన్స్‌లో పన్ను రికవరీని అడ్డుకోవడానికి ప్రాపర్టీలను వేరే వాళ్లకి ట్రాన్స్‌ఫర్ చేయడం వంటి నేరాలకు పాల్పడితే, వారిపై కఠినమైన యాక్షన్ ఉంటుంది. వారికి ఎలాంటి క్షమాభిక్ష ఉండదు. మూడుసార్లకు మించి కేటగిరీ ‘ఏ’ నేరాలకు పాల్పడితే, వాటిని కూడా ఇక నుంచి క్షమార్హమైనవిగా పరిగణలోకి తీసుకోనున్నారు.