
క్షయ వ్యాధి.. భద్రాచలం ఏజెన్సీలో అడవి బిడ్డల ఆయువు తీస్తూ ప్రమాదకరంగా విస్తరిస్తోంది. 2013 నుంచి ఇప్పటి వరకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 570 మంది దీనికి బలయ్యారంటే వ్యాధి తీవ్రత స్పష్టమవుతోంది. ఈ ప్రాంతంలో టీబీ బాధితుల సంఖ్య జాతీయ సగటు కంటే చాలా ఎక్కువగా ఉంది. వైద్యం అందకపోవడం, ప్రభుత్వం పట్టించుకోకపోవడంతోనే ఈ దుస్థితి అని అడవి బిడ్డలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ అంటువ్యాధి బాధితులు, మరణాల సంఖ్య పెరగడానికి నిరక్షరాస్యత, పోషకాహారలోపం ప్రధాన కారణాలని వైద్యాధికారులు అంటున్నారు.
చదువు.. సరైనతిండి లేక
చదువు.. బలమైనతిండి లేకపోవడం, వైద్యం సరిగా అందకపోవడంతోనే జిల్లాలో టీబీ పెరుగుదలకు ప్రధాన కారణాలని తెలుస్తోంది. బలమైన తిండి తినకపోవడం వల్ల అడవి బిడ్డల్లో రోగనిరోధక శక్తి తక్కువగా ఉంటోంది. చదువుకోకపోవడం, మూఢనమ్మకాలు పల్లెల్ని పట్టిపీడిస్తున్నాయి. బలహీనంగా ఉండడం, ఇచ్చిన సూచనలు సరిగా పాటించకపోవడంతో మరణాలు ఎక్కువగా ఉంటున్నాయని డాక్టర్లు అంటున్నారు. టీబీ బాధితులకు పోషకాహారం అందివ్వడం కోసం ప్రభుత్వం నిక్షాయ్ పోషణ్ యోజన పథకం కింద నెలకు రూ.500లు ఇస్తోంది. అయితే అధికారుల నిర్లక్ష్యం వల్ల పథకం చతికిలపడుతోంది. ఇటీవల ఐటీడీఏ పాలకమండలి సమావేశంలో టీబీ విభాగం అధికారులు ఇచ్చిన రిపోర్టే ఈ విషయం చెబుతోంది. జిల్లాలో ఈ పథకానికి అర్హులైన వారు 3438 మంది ఉండగా 1803 మందికి మాత్రమే ఆర్థిక సాయం అందుతోంది. 1635 మంది సాయం కోసం ఎదురు చూస్తున్నారు.
భద్రాద్రి జిల్లాలో ఏడేండ్లలో 570 మంది మృతి
భద్రాచలం ఏజెన్సీలోనే ఎక్కువ మరణాలు
ఏటికేడు విస్తరిస్తోంది
2013-2019 మధ్య ఏడేండ్లలో భద్రాద్రి,కొత్తగూడెం జిల్లాలో క్షయ వ్యాధి సోకి 570 మంది మృత్యువాత పడ్డారు. అత్యధికులు భద్రాచలం ఏజెన్సీ అడవి బిడ్డలే. రాష్ట్రంలో జిల్లాకో క్షయనివారణ కేంద్రం ఉంటే భద్రాద్రి కొత్తగూడెంలో జిల్లా కేంద్రం, భద్రాచలంలో రెండు చోట్ల ఉన్నాయి. తెలంగాణలో ఈ ఒక్క జిల్లాలోనే రెండో కేంద్రం ఉంది.
త్వరలోనే వ్యాధి నియంత్రణ
2016 నుంచి 2019 జులై వరకు 2,66,711 జనాభాలో 36,863 మందిని పరీక్షించగా 5,392 మంది టీబీ రోగులుగా తేలింది. 2019లో ఆగస్టు 22 నాటికి జిల్లాలో 1362 మందిని గుర్తించారు. గతంలో వ్యాధిని గుర్తించడం కష్టంగా ఉండేది. లేటెస్ట్ టెక్నాలజీతో ఇప్పుడు రెండు గంటల్లోనే గుర్తించే వీలుండడంతో బాధితుల సంఖ్య పెరుగుతోంది. ప్రస్తుతం టీబీని సమర్థంగా నియంత్రించే మందులు అందుబాటులోకి వచ్చాయి. వాటిపై మన దేశంలో కూడా పరిశోధనలు జరుగుతున్నాయి. అవి కొద్ది రోజుల్లో అందుబాటులోకి వస్తాయి. వ్యాధి నియంత్రణ కూడా త్వరలోనే సాధ్యపడుతుంది.
– డా.శ్రీనివాసరావు, జిల్లా టీబీ అధికారి