సింగరేణిలో ఎన్నికలు అప్పుడే వద్దు : టీబీజీకేఎస్

సింగరేణిలో ఎన్నికలు అప్పుడే వద్దు : టీబీజీకేఎస్
  • ఈ ఏడాది అక్టోబర్‌‌‌‌తో గుర్తింపు సంఘానికి రెండేళ్లు  పూర్తి
  • ఎన్నికల ప్రక్రియ ప్రారంభించాలని కార్మిక సంఘాల డిమాండ్
  • నాలుగేళ్లూ తమనే కొనసాగించాలంటున్న టీఆర్​ఎస్​ అనుబంధ సంఘం

గోదావరిఖని, వెలుగు : సింగరేణిలో గుర్తింపు కార్మిక సంఘం కాలపరిమితి ఈ ఏడాది అక్టోబర్​లో ముగియనుండగా, ఎన్నికలను ఎదుర్కొనేందుకు టీఆర్​ఎస్​ అనుబంధ సంస్థ వెనుకడుగు వేస్తోంది. 2017 అక్టోబర్‌‌‌‌5న గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలు  జరగ్గా, పదవీ కాలాన్ని రెండేళ్లకే కుదిస్తూ  కేంద్ర కార్మిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిర్ణయాన్ని సవాల్​ చేస్తూ, కాలపరిమితి గతంలో ఉన్నట్లు నాలుగేళ్లకు పొడిగించేలా ఆదేశాలివ్వాలని కోరుతూ టీఆర్​ఎస్​ అనుబంధ తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం (టీబీజీకేఎస్‌‌) హై కోర్టును ఆశ్రయించింది. కాగా, అక్టోబర్​లోనే ఎన్నికలు నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని ఏఐటీయూసీ, ఐఎన్‌‌‌‌టీయూసీ, హెచ్‌‌‌‌ఎంఎస్‌‌‌‌, బీఎంఎస్‌‌, సీఐటీయూ‌‌ లాంటి సంఘాలు కేంద్ర కార్మికశాఖను ఆశ్రయించాయి.

కాలపరిమితి రెండేళ్లకు కుదింపు…

సింగరేణిలో 2017 అక్టోబర్‌‌‌‌ 5న గుర్తింపు సంఘం ఎన్నికలు జరిగాయి. కోల్​బెల్ట్​ వ్యాప్తంగా11 డివిజన్లకుగాను  తొమ్మిది డివిజన్లలో విజయం సాధించిన  టీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ అనుబంధ టీబీజీకెఎస్‌‌‌‌‌‌కు గుర్తింపు సంఘం హోదా దక్కింది. రెండు డివిజన్లలో  గెలిచిన  ఏఐటీయూసీ ప్రాతినిధ్య సంఘంతో సరిపెట్టుకుంది. కాగా, ఎన్నికల్లో  సీఎం   కేసీఆర్‌‌‌‌ సహా పలువురు మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులు, టీబీజీకేఎస్‌‌‌‌ నాయకులు అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారనీ,  కార్మికులను అనేక ప్రలోభాలకు గురిచేసి గెలిచారని విపక్ష కార్మిక సంఘాలు ఆరోపించాయి. అదే ఏడాది అక్టోబర్‌‌‌‌10న ఏఐటీయూసీ, ఐఎన్‌‌‌‌టీయూసీ, హెచ్‌‌‌‌ఎంఎస్‌‌‌‌, బీఎంఎస్‌‌‌‌ సంఘాల నేతలు అప్పటి కేంద్ర కార్మిక శాఖ మంత్రి సంతోష్​ కుమార్‌‌‌‌ గంగ్వార్‌‌‌‌ ను కలిసి ఫిర్యాదు చేశారు. వీటిని పరిగణలోకి తీసుకున్న కేంద్ర కార్మిక శాఖ, టీబీజీకేఎస్​ కాలపరిమితిని  నాలుగేళ్ల నుంచి రెండేళ్లకు తగ్గిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. గుర్తింపు, ప్రాతినిధ్య సంఘాలకు సర్టిఫికెట్లు ఇవ్వడంలోనూ  కార్మిక శాఖ జాప్యం చేసింది. చివరకు 2018 మే 23న గుర్తింపు, ప్రాతినిధ్య సంఘాలకు సర్టిఫికెట్లు  అందించిన అధికారులు, 2019 అక్టోబర్‌‌‌‌31వరకే కొనసాగాలని మరోసారి స్పష్టత ఇచ్చారు.

కేంద్ర కార్మిక శాఖను ఆశ్రయించిన విపక్ష సంఘాలు..

2019  అక్టోబర్‌‌‌‌ 31కల్లా గుర్తింపు సంఘం కాలపరిమితి పూర్తవుతున్నందున ఈ లోపే  ఎన్నికల  ప్రక్రియ ప్రారంభించాలని కేంద్రకార్మికశాఖను విపక్ష సంఘాలు కోరుతున్నాయి.  ఐఎన్‌‌‌‌టీయూసీ సెక్రెటరీ జనరల్‌‌‌‌ బి.జనక్‌‌‌‌ ప్రసాద్‌‌‌‌ ఇటీవలే కేంద్ర మంత్రి గంగ్వార్‌‌‌‌ ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఏఐటీయూసీ అధ్యక్షుడు వై.గట్టయ్య కేంద్ర కార్మిక శాఖకు లేఖ రాశారు. హెచ్‌‌‌‌ఎంఎస్‌‌‌‌ ప్రధాన కార్యదర్శి రియాజ్‌‌‌‌ అహ్మద్‌‌‌‌కూడా హైదరాబాద్‌‌‌‌ లో కార్మిక శాఖ అధికారులను కలిసి వెంటనే ఎన్నికలు నిర్వహించాలని విన్నవించారు. ఈక్రమంలో కేంద్ర కార్మిక శాఖ నిర్ణయంతోపాటు హైకోర్టు తీర్పుపై కార్మికుల్లో ఉత్కంఠ నెలకొంది.

హైకోర్టుకు టీబీజీకేఎస్‌‌‌‌..

గతంలో నాలుగేళ్లు ఉన్న గుర్తింపు సంఘం కాలపరిమితిని రెండేళ్లకు కుదిస్తూ కేంద్ర కార్మికశాఖ జారీ చేసిన ఉత్తర్వులను టీబీజీకెఎస్‌‌ హైకోర్టులో‌‌  సవాల్​ చేసింది.  విచారణ చేపట్టిన ధర్మాసనం.. గతంలో కొనసాగిన విధానం, తాజాగా అమలు చేస్తున్న పద్ధతి, ఇందుకు దారితీసిన పరిస్థితులపై  వివరాలు అందజేయాలని కేంద్ర కార్మిక శాఖను  ఆదేశించింది. కోర్టు నుంచి తుది తీర్పు వెలువడాల్సి ఉంది. గతంలో నైవేలీ లిగ్నైట్‌‌‌‌ పరిశ్రమలో గుర్తింపు సంఘానికి  రెండేళ్ల  కాలపరిమితి నిర్ణయించగా, కోర్టు నాలుగేళ్లకు పెంచుతూ తీర్పు ఇచ్చింది. ఈక్రమంలో తెలంగాణ హైకోర్టు తీర్పు కూడా తమకు అనుకూలంగా ఉంటుందని టీబీజీకేఎస్‌‌‌‌ నేతలు ఆశిస్తున్నారు.