
- ఐదు నెలలపాటు శిక్షణ.. మంత్రి శ్రీధర్ బాబు సమక్షంలో జేఎన్టీయూతో ఒప్పందం
హైదరాబాద్, వెలుగు: సాఫ్ట్వేర్ సెక్టార్లో ఇంజనీరింగ్విద్యార్థులకు ప్లేస్మెంట్లు వచ్చేలా శిక్షణనిచ్చేందుకు టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్అయాన్(టీసీఎస్అయాన్) ముందుకొచ్చింది. విద్యార్థుల్లో స్కిల్స్ పెంచేలా ఐదు నెలల పాటు టీసీఎస్ అయాన్‘ప్లేస్మెంట్సక్సెస్ ప్రోగ్రామ్’ కింద శిక్షణనిస్తుందని ఐటీ, ఇండస్ట్రీస్ మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. గురువారం సెక్రటేరియెట్‌లో మంత్రి శ్రీధర్ బాబు సమక్షంలో జేఎన్టీయూ హైదరాబాద్, టీసీఎస్ అయాన్ సంస్థలు దీనిపై ఒప్పందం చేసుకున్నాయి.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. యువతలో స్కిల్స్‌ను పెంచేందుకు ఇప్పటికే యంగ్‌ఇండియా స్కిల్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేశామని తెలిపారు. ‘‘సాంకేతిక నైపుణ్యాలు లేకుండా డిగ్రీలతో ఉద్యోగాలు రావడం కష్టం. దీనిని అర్థం చేసుకున్నందునే శిక్షణపై దృష్టి సారించాం. చదువు పూర్తి చేసే సమయానికి ప్రతి ఒక్కరికీ ఏదో ఒక అంశంలో నైపుణ్యం పెంచగలిగితే ఉద్యోగాలు ఇవ్వడం కోసం కంపెనీలు ముందుకొస్తాయి. టీసీఎస్ అయాన్ సంస్థ మొదటి దశలో ప్రతి ఐదు నెలలకు వంద మంది ఇంజనీరింగ్ విద్యార్థులకు ట్రైనింగ్ ఇచ్చి ఉద్యోగాలకు సిద్ధం చేస్తుంది. ఆ సంస్థతో ఎంప్యానెల్ అయిన 3,000 పైగా కంపెనీలు వీరిలో ప్రతిభావంతులను ఎంపిక చేసుకుని ఉద్యోగాలు ఇస్తాయి.
పైలట్ కార్యక్రమం కింద మంథనిలోని జేఎన్టీయూ కాలేజీ విద్యార్థులకు ప్లేస్‌మెంట్ సక్సెస్ ప్రోగ్రాం కింద నైపుణ్య శిక్షణకు ఎంపిక చేస్తాం. 2023లో యువతకు ఉపాధి కల్పన 44.3% ఉండగా.. గతేడాది 42.6 శాతానికి పడిపోయింది. రాష్ట్రంలో ఈ పరిస్థితి రాకుండా ఉండేందుకే ట్రైనింగ్‌కు ప్రాధాన్యమిస్తున్నాం’’ అని ఆయన వెల్లడించారు. ఈ అవగాహన ఒప్పంద కార్యక్రమంలో టీసీఎస్ అయాన్ గ్లోబల్ హెడ్ వెంగుస్వామి, స్కిల్ ఎడ్యుకేషన్ బిజినెస్ హెడ్ స్మృతి ముల్యే, జేఎన్ టీయూ వీసీ తదితరులు పాల్గొన్నారు.