
TCS Layoffs: దేశంలోని అతిపెద్ద ఐటీ దిగ్గజం టీసీఎస్. ప్రస్తుతం ఈ కంపెనీలో ప్రపంచ వ్యాప్తంగా 6 లక్షలకు పైగానే ఉద్యోగులు పనిచేస్తున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా టీసీఎస్ తన ఉద్యోగుల్లో 2 శాతం అంటే 12వేల మందిని ఈ ఏడాది లేఆఫ్ చేయనున్నట్లు చేసిన ప్రకటన టెక్కీల గుండెల్లో గుబులు పుట్టిస్తోంది. ఏ క్షణం తమకు లేఆఫ్ నోటీసులు వస్తాయో అనే భయాలు చాలా మందిని వెంటాడుతున్నాయి.
అయితే ఉద్యోగుల తొలగింపులకు ఏఐ వినియోగమే కారణంగా వార్తల్లో వినిపించింది. కానీ దీనిపై కంపెనీ సీఈవో కృతివాసన్ క్లారిటీ ఇచ్చారు. ఏఐ వల్ల తమ సంస్థలో ఉత్పత్తి సామర్థ్యం కేవలం 20 శాతం మాత్రమే పెరిగిందని దాని వల్ల ఉద్యోగుల తొలగింపులు నిర్వహించటం లేదన్నారు. ప్రస్తుతం కంపెనీకి ఉన్న అవకాశాలకు తగినట్లుగా నైపుణ్యాలు లేని ఉద్యోగులను మాత్రమే తొలగించనున్నట్లు సీఈవో చెప్పారు.
అంటే ఉద్యోగికి ఉన్న నైపుణ్యం ఆధారంగా వారిని ఏదైనా పనిలో కొనసాగించటానికి కుదరని టెక్కీలను మాత్రమే లేఆఫ్ చేయనున్నట్లు చెప్పారు. పూర్తిగా ఇక్కడ స్కిల్ గ్యాప్ మాత్రమే కారణంగా ఉన్నట్లు చెబుతున్నారు కృతివాసన్. మంచి నైపుణ్యాలు కలిగిన ఉద్యోగుల కోసం వేట, నియామకాలు కొనసాగుతూనే ఉంటాయని క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుతం తీసుకున్న నిర్ణయం కంపెనీలోని మిడ్ లెవెల్, సీనియర్ లెవెల్ స్థాయి ఉద్యోగులపై మాత్రమే ప్రభావాన్ని చూపనున్నట్లు టీసీఎస్ చెబుతోంది.
ALSO READ : యూఎస్‌తో ట్రేడ్ డీల్‌లో ఇండియా జర జాగ్రత్త
కంపెనీ తమ ఉద్యోగులను ఎప్పటికప్పుడు అప్ స్కిల్లింగ్ చేస్తోందని చెప్పింది. లేఆఫ్ వల్ల ప్రభావితం అయ్యే ఉద్యోగులకు సివరెన్స్ ప్యాకేజ్, ఇన్సూరెన్స్ సౌకర్యంతో పాటు బయట ఉద్యోగ అవకాశాలకు సహాయం అందించనున్నట్లు టీసీఎస్ వెల్లడించింది. టీసీఎస్ తన హెచ్ఆర్ పాలసీలో ఏడాడికి ఉద్యోగి బెంట్ కాలాన్ని 35 రోజులకు పరిమితం చేస్తూ బిల్లింగ్ డేట్స్ 225గా ఉండాలని ప్రకటించిన కొన్ని వారాల తర్వాత లేఆఫ్స్ ప్రకటించటం కొంత ఆందోళనలు పెంచుతోంది.