
ముంబై: వర్క్ ఫ్రం ఆఫీస్ రూల్‌ను అతిక్రమిస్తున్న వారిపై క్రమశిక్షణా చర్యలు తీసుకుంటామని టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) తన ఉద్యోగులకు మెమోలు పంపించింది. నెలలో కనీసం 12 రోజులు ఆఫీసుకు రావాలని టీసీఎస్ ఇటీవలే రూల్ పెట్టింది. కిందటేడాది అక్టోబర్‌లో ఆఫీసుకు వారంలో మూడు రోజులు రావాలని ఉద్యోగులను టీసీఎస్ కోరింది.
ఉద్యోగులను ఆఫీసులకు రప్పించాలని గత కొన్ని నెలలుగా కంపెనీ గట్టి ప్రయత్నాలు చేస్తోంది. ఉద్యోగులతో తమ ఆఫీసులన్నీ హడావుడిగా కనిపించాలని కోరుకుంటున్నట్లు పేర్కొంది. 2023 ఫైనాన్షియల్ ఇయర్లో టీసీఎస్ 44 వేల మంది ఫ్రెషర్లకు అవకాశం ఇవ్వడంతోపాటు, అనుభవమున్న వారినీ తీసుకుంది. టీసీఎస్‌కు మొత్తం 6,14,795 మంది ఉద్యోగులున్నారు. లింక్డ్ ఇన్ రిపోర్టు ప్రకారం 2023 లో బెస్ట్ వర్క్‌ప్లేస్ లిస్టులో టీసీఎస్ టాప్‌లో నిలిచింది.